సూడాన్‌లో ఆగని కాల్పుల మోత
దద్దరిల్లుతున్న నగరాలు
భారతీయుల భద్రతపై ఆందోళన
ఖార్తూమ్ : కల్లోలిత సూడాన్‌లో ఇరువర్గాల మధ్య సామరస్యం సాధించేందుకు
అంతర్జాతీయంగా మొదలైన ప్రయత్నాలకు పురిట్లోనే సంధి కొట్టినట్లయింది. 24 గంటల
పాటు తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటించడానికి ఇరు వర్గాలూ అంగీకరించినట్లు
కనిపించినా అవి కార్యరూపం దాల్చలేదు. బుధవారం సయితం సూడాన్ రాజధాని ఖార్తూమ్
సహా పలు ప్రాంతాల్లో కాల్పులు, పేలుళ్ల మోత మోగింది. భారీస్థాయి మర తుపాకులు,
ఫిరంగులు, యుద్ధ విమానాలతో విరుచుకుపడుతుండడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో
తెలియని పరిస్థితి నెలకొంది. దేశంపై నియంత్రణ సాధించడానికి సైన్యం,
పారామిలిటరీ దళం (ఆర్ఎస్ఎఫ్) పట్టువీడకుండా పోరాడుతున్నాయి. మృతుల సంఖ్య
270 దాటిపోయింది. మంగళవారం సాయంత్రం సూర్యాస్తమయం నుంచి బుధవారం సాయంత్రం వరకు
కాల్పుల విరమణ పాటించాలని, తర్వాత దానిని మరింత కాలం పొడిగించాలని ప్రయత్నాలు
జరిగాయి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ నెరిపిన దౌత్యానికి ఇరు
వర్గాలూ అంగీకరించినట్లే కనిపించినా చివరకు అవి విఫలమయ్యాయి. దీనికి
ఉభయపక్షాలూ పరస్పరం నిందించుకుంటున్నాయి. భవనాల్లో కంటే ఆరుబయటే సురక్షితమనే
ఉద్దేశం ప్రజల్లో కనిపిస్తోంది. పలుచోట్ల సాయుధులు వీధుల్లో తిరుగుతూ ఇళ్లు,
దుకాణాల్లో తమకు కావాల్సినవి తీసుకుపోతున్నారు. ప్రతిఘటిస్తే ప్రాణాలకే
ప్రమాదం తప్పదని ప్రజలు భయపడుతున్నారు. వాహనాలను దొంగిలించుకుపోతుండడంతో
కొంతమంది ముందు జాగ్రత్త చర్యగా వాటి చక్రాల్లో గాలి తీసేసి, ఇంధనం లేకుండా
చేస్తున్నారు. ఘర్షణ మొదలైనప్పటి నుంచి ఖార్తూమ్ విశ్వవిద్యాలయంలో
చిక్కుకుపోయిన 89 మంది విద్యార్థులు, సిబ్బందిని ఎట్టకేలకు సైన్యం రక్షించింది.