ఎన్నికల ప్రచారంలో అనూహ్య పరిణామం
సురక్షితంగా బయటపడిన కిషిద
టోక్యో : స్థానిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జపాన్ ప్రధాని ఫుమియొ కిషిదను
లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తి బాంబుదాడికి పాల్పడ్డాడు. పశ్చిమ
జపాన్‌లోని సైకజకి ఓడరేవు సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదేరీతిలో 9
నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో జరిగిన దాడిలో మాజీ ప్రధాని షింజో అబె ప్రాణాలు
కోల్పోయిన ఘటన ప్రకంపనలు ఇప్పటికీ జపాన్ రాజకీయాల్లో కొనసాగుతున్నాయి. ఇలాంటి
తరుణంలో కిషిదను లక్ష్యంగా చేసుకుని బాంబు విసిరినట్లు అనుమానిస్తున్న
వ్యక్తిని భద్రత బలగాలు గుర్తించి క్షణాల్లో అదుపులోకి తీసుకున్నాయి. అతని
నుంచి మరో బాంబును స్వాధీనం చేసుకున్నాయి. భారీగా అలముకున్న పొగతో ఆ ప్రాంతంలో
కలకలం రేకెత్తినా ప్రధాని సురక్షితంగా బయటపడి ప్రచార కార్యక్రమాన్ని
కొనసాగించారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారానికి
కిషిద వచ్చారు. ప్రధానికి సమీపంలో ఏదో వస్తువు పడగానే భద్రతా బలగాలు
అప్రమత్తమై ఆయన్ని కాస్త దూరంగా తీసుకువెళ్లాయి. తెల్లని మాస్కు ధరించిన
వ్యక్తిని చుట్టుముట్టి అతని చేతుల్లో ఉన్న పొడవైన గొట్టం లాంటి వస్తువును
స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుండగా కిషిద అంతకుముందు నిల్చొన్నచోట పెద్ద
శబ్దంతో పేలుడు వినిపించింది. ఆదివారం జి-7 విదేశాంగ మంత్రుల సమావేశాల్లో
పాల్గొనేందుకు విదేశీ ప్రముఖులు జపాన్‌కు చేరుకుంటున్న నేపథ్యంలో భద్రత
చర్యలను కట్టుదిట్టం చేశారు.