ప్రపంచ బ్యాంకు సదస్సులో నరేంద్ర మోడీ పిలుపు
వాషింగ్టన్ : వాతావరణ మార్పుల సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు పెద్ద
ఎత్తున ఉద్యమించాలని ప్రధాని నరేంద్ర మోడీపిలుపునిచ్చారు. ఈ అంశంపై ప్రపంచ
బ్యాంకు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన వీడియో లింక్ ద్వారా
ప్రసంగించారు. ‘‘వాతావరణ మార్పులను అడ్డుకోవడం ప్రభుత్వాల స్థాయిలో జరగాల్సిన
పని అని చాలామంది భావిస్తారు. ఇందులో వ్యక్తిగతంగా తామేమీ చేయలేమని
అనుకుంటారు. కానీ ఈ విషయంలో మనమంతా ఎంతో చేయగలం. కేవలం సదస్సుల ద్వారా ఏమీ
జరగదు. ఈ పోరు చర్చా వేదికల నుంచి ప్రతి ఇంట్లోనూ డిన్నర్ టేబుళ్ల దాకా
వెళ్లాలి. అప్పుడే అది ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఈ విషయంలో భారత ప్రజలు
కొన్నేళ్లుగా ఎంతో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. జల పరిరక్షణ, సహజ సాగు,
చిరుధాన్యాల వాడకం, ఆరోగ్యకరమైన జీవన విధానం, లింగ సమానత్వ సాధన, స్వచ్ఛత,
సూక్ష్మసేద్యం వంటివాటిని ఓ ఉద్యమంగా చేపట్టి విజయవంతం చేస్తున్నారు. అన్ని
దేశాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించడంలో అంతర్జాతీయ సంస్థలది కీలక
పాత్ర’’ అన్నారు.