టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి ఈ క్రమంలో భద్రతా దళాలు తీవ్రంగా కొట్టటం వల్ల ప్రముఖ చెఫ్ మెహర్షాద్ షాహిదీ అలియాస్ ‘జామీ ఆలివర్’ మృతి చెందటం కలకలం సృష్టించింది. ఆయన అంత్యక్రియలకు శనివారం వేలాది మంది హాజరయ్యారు. మెహర్షాద్ షాహిదీ 20వ పుట్టిన రోజుకు ఒక రోజు ముందే ప్రాణాలు కోల్పోవటం గమనార్హం. అరక్ సిటీలో మెహర్షద్ షాహిదీని అదుపులోకి తీసుకున్నారు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్. వారు తీవ్రంగా కొట్టటం ద్వారా మెహర్షద్ షాహిదీ పుర్రె దెబ్బతిని బుధవారం మరణించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘అరెస్ట్ చేసిన తర్వాత లాఠీతో కొట్టటం ద్వారానే మా కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. అధికారుల ఒత్తిడి కారణంగా గుండె పోటుతో మరణించాడని చెప్పాల్సి వచ్చింది.’ అని బాధితుడి బంధువు ఒకరు ఇరాన్ ఇంటర్నేషనల్ టీవీకి తెలిపారు. మెహర్షద్ షాహిదీ గుండెపోటుతోనే మరణించాడని చెప్పాలని అధికారులు ఒత్తిడి చేశారని ఆయన కుటుంబం సభ్యులు సైతం వెల్లడించారు. మెహర్షద్ షాహిదికి ఇన్స్టాగ్రామ్లో 25వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన చేసిన వంటలు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన లభిస్తోంది.