ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు ద్వీప సమూహ దేశం ఇండోనేషియా సరికొత్త ప్రణాళికతో సిద్ధమైంది. బ్యాంక్ అకౌంట్లో రూ.కోటి ఉంటే చాలు.. అలాంటి వారికి సెకెండ్ హోం వీసాను జారీ చేసేందుకు సిద్ధమైంది. బాలి: ద్వీప సమూహ దేశం ఇండోనేషియా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త ప్రణాళికతో సిద్ధమైంది. వీసా జారీలో నిబంధనలను ఇటీవల సడలించింది. తాజా నిబంధనల ప్రకారం.. బ్యాంకు అకౌంట్లో రూ.కోటి ఉంటే చాలు.. వారికి ‘సెకెండ్ హోం’ వీసా జారీ చేస్తారు. ఈ వీసాలకు 5, 10 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. క్రిస్మస్ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.
ఇది ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థకు సహకారం అందించేందుకు విదేశీయులకు ఇస్తున్న ఆర్థికేతర ప్రోత్సాహం అని ఇండోనేషియా ఇమ్మిగ్రేషన్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. తాజా నిర్ణయంతో నిపుణులు, పదవీవిరమణ పొందినవారు, ఇతర సంపన్నులకు దీర్ఘకాలిక బసను అందిస్తున్న కోస్టారికా, మెక్సికో దేశాల సరసన ఇండోనేషియా చేరినట్లయింది. కరోనా విజృంభణ తర్వాత పని విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ‘ఇంటి నుంచి పని’కే ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు యాజమాన్యం కూడా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు ఉద్యోగులు పర్యాటక ప్రాంతాల్లో విడిది చేస్తూనే ఉద్యోగం చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి వారిని తమవైపు ఆకర్షించేందుకు ఇండోనేషియా తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.