ఆంక్షల ప్రభావం అంతంతే!
వాషింగ్టన్ : ‘‘పుతిన్ ఆక్రమణదారుడు. యుద్ధానికి దిగాడు. ఆ దేశం తీవ్ర
పరిణామాలు ఎదుర్కొవాల్సిందే’’ ఇవీ కొన్నాళ్ల క్రితం రష్యాపై ఆంక్షలు విధిస్తూ
అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలు. రష్యాపై పనిచేయని పాశ్చాత్య
దేశాల నియంత్రణలు సామాన్యుల జీవితాలు యథావిధిగా. ‘‘పుతిన్ ఆక్రమణదారుడు.
యుద్ధానికి దిగాడు. ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సిందే’’ ఇవీ కొన్నాళ్ల
క్రితం రష్యాపై ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలు.
అయితే ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభమై ఏడాది గడిచిపోయింది. మరి ఈ అంక్షలు
పనిచేశాయా..? రష్యా కుదేలైందా..? ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందా…? అని
చూస్తే.. లేదనే చెప్పాలి. అమెరికా, నాటో దేశాలు విధించిన ఆంక్షలు బ్యాంకులను,
సంపన్నులను, సాంకేతిక దిగుమతులను దెబ్బతీసినా, సామాన్య రష్యన్ పౌరుల
జీవితాలపై మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. పౌరుల జీవితాలు
ఉక్రెయిన్ యుద్ధానికి ముందు ఎలా నడిచాయో ఇప్పుడూ కొద్దో గొప్పో తేడాలతో అలానే
సాగుతున్నాయి. నిరుద్యోగం అమాంతం పెరిగిపోనూ లేదు, రష్యన్ కరెన్సీ రూబుల్
విలువ పతనమూ కాలేదు, బ్యాంకులు కుప్పకూలనూ లేదు. దుకాణాలలో విదేశీ బ్రాండ్లు
కానీ, వాటి స్థానిక ప్రత్యామ్నాయాలు కానీ పుష్కలంగా దొరుకుతున్నాయి. ఉదాహరణకు
అమెరికన్ బ్రాండ్లు మెక్ డొనాల్డ్స్, స్టార్ బక్స్ దుకాణం సర్దేసినా వాటి
ప్రత్యామ్నాయాలు రష్యన్లకు అందుబాటులోకి వచ్చాయి.
భారత్, చైనా, తుర్కియే వంటి దేశాలకు చమురు ఎగుమతుల ద్వారా ఆర్జించిన 32,500
కోట్ల డాలర్లు రష్యా వద్ద పోగుపడ్డాయనీ, అదే పాశ్చాత్య ఆర్థిక ఆంక్షలను
తట్టుకునే సత్తాను రష్యాకు ఇచ్చిందని నిపుణులు చెబుతున్నారు. కానీ, రష్యన్
చమురు ధరపై పాశ్చాత్య దేశాలు విధించిన 60 డాలర్ల పరిమితి మూలంగా రష్యాకు
క్రమంగా ఆదాయం పడిపోయి కష్టాలు మొదలవుతాయని కొందరి అంచనా. దీనితో
విభేదిస్తున్న క్రిస్ వీఫర్ అనే నిపుణుడు తక్కువ ధరకు సైతం రష్యా చమురు
ఎగుమతుల ద్వారా విదేశీమారక ద్రవ్యం ఆర్జిస్తూనే ఉంటుందనీ, కాబట్టి ఆర్థిక
ఒత్తిడి వల్ల ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా విరమించే ప్రసక్తి ఉండదని చెప్పారు.
ఆపిల్ సంస్థ రష్యా నుంచి బిచాణా ఎత్తేసినా ఐఫోన్లు మార్కెట్లో దొరుకుతూనే
ఉన్నాయి. పోలండ్ నుంచి కోకాకోలా వస్తూనే ఉంది. స్థానిక కోలాలూ
లభ్యమవుతున్నాయి. విదేశీ కార్లు పరిమిత సంఖ్యలో, ఎక్కువ ధరలకు లభిస్తున్నాయి.
ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా రష్యా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 0.3 శాతం వృద్ధి నమోదు
చేస్తుందని ఐఎంఎఫ్ అంచనా. పాశ్చాత్య దేశాల ఆంక్షలను ఎదుర్కొనే విధంగా
స్వదేశంలో ఉత్పత్తి పెంచాలనే అభిలాష రష్యన్లలో బలపడుతోంది.