ఉగ్రవాదం విషయంలో చైనా అనుసరిస్తున్న ధోరణిని భారత్, అమెరికా, జపాన్,
ఆస్ట్రేలియాల ‘క్వాడ్’ కూటమి తీవ్రంగా తప్పుపట్టింది. డ్రాగన్ పేరు
ప్రస్తావించకుండా తీవ్రవాదంపై ఆ దేశం అనుసరిస్తున్న తీరును పరోక్షంగా
ఎండగట్టింది. శుక్రవారం భారత్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్
నేతృత్వంలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగమంత్రులు ఆంటోనీ బ్లింకెన్,
యోషిమాసా హయాషి, పెన్నీ వాంగ్ సమావేశమయ్యారు. అనంతరం విడుదల చేసిన ఉమ్మడి
ప్రకటనలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణానికి తాము కట్టుబడి
ఉన్నామన్న విషయాన్ని పునరుద్ఘాటించారు. అయితే ఈ సారి క్వాడ్ ఎజెండాలో
ఉగ్రవాదం కూడా చేరింది. జైశంకర్ మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై ప్రత్యేక కార్యాచరణ
బృందాన్ని ఏర్పాటు చేయాలని క్వాడ్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఉగ్ర
జాబితాను రాజకీయం చేయొద్దన్నది సమావేశ నిర్ణయాల్లో ఒకటని తెలిపారు. ఇది ఒక
రకంగా నేరుగా చైనాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యే. గతంలో నిబంధన 1267 అల్‌ఖైదా
ఆంక్షల కమిటీ కింద భారత్ ప్రతిపాదించిన ఉగ్రవాదుల జాబితాను చైనా సాంకేతిక
కారణాలు చూపుతూ పదే పదే అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్‌లో
దాడులకు కుట్రపన్ని పాక్ తీవ్రవాదులకు మద్దతిస్తూ వచ్చింది. వారికి
వ్యతిరేకంగా పూర్తి సాక్ష్యాలు ఉన్నా చైనా వీటో చేయడంతో చాలా సార్లు భారత్‌కు
చుక్కెదురైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉగ్ర జాబితాను రాజకీయం చేయొద్దన్న నిర్ణయం
క్వాడ్ తీసుకోవడం గమనార్హం. భారత్ అధ్యక్షతన జరిగిన క్వాడ్
విదేశాంగమంత్రుల సమావేశంపై చైనా మండిపడింది. శాంతి, అభివృద్ధి తదితర అంశాల్లో
ఒక దేశం ఇంకో దేశంతో మాట్లాడుకోవాలని, ఇలా కూటములు కట్టడం సరికాదని పేర్కొంది.