ఎన్టీఆర్ ఘంటసాల ఇద్దరూ యుగ పురుషులు అని, ప్రపంచం లోని తెలుగు వారందరికీ
గర్వకారణం అని తెలంగాణ ముఖ్య ఎన్నికల కమిషనర్ సి. పార్ధసారధి కొనియాడారు.
ఎన్టీఆర్ ఘంటసాల శత జయంతి ఉత్సవాలను దుబాయ్ లో నిర్వహించడం అభినందనీయం
అన్నారు. ఆదివారం దుబాయ్ గ్రాండ్ ఎక్సల్సర్ హోటల్ లో కళ 10వ వార్షికోత్సవ
వేడుకలు, వైభవంగా ఎన్టీఆర్ ఘంటసాల శత జయంతి ఉత్సవాలు జరిగాయి. భారత ప్రభుత్వ
సాంస్కృతిక శాఖ, కళ పత్రిక , కలయిక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సెల్ హెల్త్,
భువనేశ్వరి గ్రూప్ సౌజన్యం తో శత వసంత కళా వైభవం పేరిట జరిగిన వేడుకల్లో
ఎన్టీఆర్ ఘంటసాల శతాబ్ది అంతర్జాతీయ జీవన సాఫల్య పురస్కారం ఐదు లక్షల నగదు
జ్ఞాపిక తో స్వాతి పత్రిక చీఫ్ ఎడిటర్ వేమూరి బలరామ్ ను ఘనంగా సత్కరించారు.
ఎన్టీఆర్ శతాబ్ది అంతర్జాతీయ కళా పురస్కారం తో హీరో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్
ను, ఘంటసాల శతాబ్ది అంతర్జాతీయ కళా పురస్కారం తో ఘంటసాల కోడలు ప్రముఖ నర్తకి
ఘంటసాల పార్వతి రవి, ప్రముఖ గాయకులు చంద్రతేజ లను సన్మానించారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన సి. పార్ధసారధి మాట్లాడుతూ ఎన్టీఆర్ మహానటుడు అని,
ఘంటసాల ప్రతి ఇంట ఎప్పటికి వినిపిస్తుంటాయని, ఇద్దరూ నిత్య స్మరణీయులని
ప్రశంశించారు. వేమూరి బలరామ్ మాట్లాడుతూ దుబాయ్ లో ఇంతటి ప్రేమ ను చూస్తే
సంతోషం గా ఉందని, ఎన్టీఆర్ తో తనకు అత్యంత అనుబంధం ఉందని, పూర్వ జన్మ సుకృతంగా
భావిస్తున్నట్లు తెలిపారు. హీరో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గారి
ఇంట్లో పుట్టిన వాడినని, ఎన్టీఆర్ అంటే తనకు దేవుడి తో సమానం అని
చెప్పుకున్నారు. పాత్రికేయులు జి. భగీరధ రచించిన మహా నటుడు ఎన్టీఆర్
పుస్తకాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అధ్యక్షత
వహించిన సభ లో కళా పోషకులు తోట రామ్ కుమార్, కళ పత్రిక సంపాదకులు డాక్టర్
మహ్మద్ రఫీ, కలయిక ఫౌండేషన్ చైర్మన్ చేరాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ ఎక్స్ లెన్స్ కళ పురస్కారాలతో సెల్ హెల్త్ ఎండి చింతా రవికుమార్
(వెల్ నెస్), సామాజిక సేవా రంగం నుంచి భువనేశ్వరి గ్రూప్ సిఇఓ రెడ్డి ఆనంద
నరసింహ స్వామి, సీనియర్ పాత్రికేయులు జి. భగీరథ, మహమ్మద్ షరీఫ్, కోసూరు
రత్నం, రుబీనా పర్వీన్, డాక్టర్ సానియా రియాజ్, డాక్టర్ టి. వీరభద్రరావు,
కూచిపూడి నర్తకి ప్రీతి తాటంభోట్ల, వరల్డ్ తెలుగు ఫెడరేషన్ మిడిల్ ఈస్ట్
అధ్యక్షులు రావేల రమేష్ తదితరులు పురస్కారాలు స్వీకరించారు. దుబాయ్ తెలుగు
వారితో కిక్కిరిసిన సభ లో లాఫింగ్ స్టార్ మిమిక్రీ రమేష్ నవ్వులు పూయించారు.
ఘంటసాల పార్వతి బృందం (చెన్నై ) భరత నాట్యం, దుబాయ్ నాట్యగురు ప్రీతి శిష్య
బృందం కూచిపూడి నృత్యం ప్రదర్శించి తెలుగు కళ ను చాటి చెప్పారు.