ఉక్రెయిన్ నుంచి బలగాలను రష్యా వెనక్కి తీసుకోవాలి
ఐరాస సర్వప్రతినిధి సభ తీర్మానం
మళ్లీ ఓటింగ్‌కు దూరంగా భారత్
ఐరాస : ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని తక్షణమే ముగించాల్సిందిగా రష్యాను డిమాండ్
చేస్తూ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది.
ఐరాస చార్టర్ సూత్రాలకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకతను అందులో
నొక్కిచెప్పింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఐరాసలో ముందునుంచీ
అనుసరిస్తున్న వైఖరినే భారత్ కొనసాగించింది. తాజా తీర్మానంపైనా ఓటింగ్‌కు
దూరంగా ఉంది. అయితే ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం
చేసింది. మనుషుల ప్రాణాలు తీయడం ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం కనుగొనలేమని
పేర్కొంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఐరాస
సర్వప్రతినిధి సభ ప్రత్యేకంగా సమావేశమైంది. శాంతిస్థాపనకు సంబంధించి
ఉక్రెయిన్, దాని మద్దతుదారు దేశాలు ఈ సందర్భంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.
ఉక్రెయిన్ నుంచి బలగాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రష్యాను అందులో డిమాండ్
చేశాయి. దానికి అనుకూలంగా 141 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 7 ఓట్లు వచ్చాయి.
భారత్, చైనా సహా మొత్తం 32 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఓటింగ్
ప్రక్రియకు ముందు అమెరికా, జర్మనీ, ఉక్రెయిన్ సహా పలు దేశాలు భారత్‌ను
సంప్రదించాయి. తీర్మానానికి మద్దతు పలకాలని కోరాయి. అయితే వాటి ప్రయత్నాలు
ఫలించలేదు. ఓటింగ్ అనంతరం ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్
మాట్లాడారు. ఐరాస చార్టర్ సూత్రాలకు భారత్ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
‘‘చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలి. మేం ఎప్పుడూ
ఇదే చెబుతున్నాం. ప్రస్తుత తీర్మానం ఉద్దేశాలు అర్థం చేసుకోదగ్గవే. కానీ
అందులో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. మేం కాంక్షిస్తున్న శాశ్వత శాంతి
స్థాపనకు అవి విఘాతం కలిగించొచ్చు. అందుకే ఓటింగ్‌కు దూరంగా ఉన్నాం’’ అని
కాంబోజ్ పేర్కొన్నారు.
పాక్‌పై మండిపడ్డ భారత్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు
నిర్వహించిన ఐరాస సర్వప్రతినిధి సభ ప్రత్యేక సమావేశంలో జమ్మూకశ్మీర్ అంశాన్ని
ప్రస్తావించింది. దీంతో భారత్ ఘాటుగా స్పందించింది. సమయం సందర్భం లేకుండా
మాట్లాడుతోందంటూ పాక్ తీరును ఎండగట్టింది.
గాంధీజీ శాంతి సందేశంపై ప్రత్యేక కార్యక్రమం : మహాత్మా గాంధీ అందించిన శాంతి
సందేశాన్ని చాటిచెప్పేలా ఐరాస ప్రధాన కార్యాలయంలో భారత్ ప్రత్యేక
కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చింది. ‘గాంధీ ధర్మకర్తృత్వం: మిషన్ లైఫ్, మానవ
మనుగడ’ పేరుతో నిర్వహించిన ఈ చర్చా కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులు,
విద్యాసంస్థలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి
రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా శాంతి, అహింసల
గురించి జోరుగా చర్చ నడుస్తున్నవేళ గాంధీజీ సందేశంపై కార్యక్రమాన్ని
నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుందని అన్నారు. భారత ప్రధాని మోదీ వసుధైక
కుటుంబ భావనతో ముందుకెళ్తున్నారని చెప్పారు. కొవిడ్ కష్టకాలంలో తుర్కియే,
సిరియాల్లో భూకంపం వచ్చినప్పుడు భారత్ వేగంగా స్నేహహస్తాన్ని చాచిన సంగతిని
గుర్తుచేశారు.