తమ దేశంలో శాంతిని నెలకొల్పే ముసాయిదా తీర్మానం విషయంలో సహకారం అందించాలని
ఉక్రెయిన్ మన దేశాన్ని కోరింది. శాంతి ప్రణాళిక ముసాయిదాకు అనుకూలంగా ఐరాసలో
ఓటు వేయాలని విజ్ఞప్తి చేసింది. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ డోభాల్‌తో
ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ అధిపతి యాండ్రీ యెర్మాక్ ఫోన్లో మాట్లాడారు.
క్షేత్రస్థాయిలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పోరాటం కొనసాగుతున్న తీరును
వివరించారు. ‘‘రష్యా మాపై మరిన్ని దాడులకు సిద్ధపడుతోందని తెలుసు. వాటికి
దీటుగా బదులిచ్చేందుకు మేం సిద్ధమవుతున్నాం. మా సైనికులు అసాధారణ ధైర్య
సాహసాలతో పోరాడుతున్నారు. రష్యా సైనికుల్లో ఆ ప్రేరణ లేదు. మా భూభాగాలకు
విముక్తి లభించేవరకు ఆగేది లేదు. మాకు కేవలం ఆయుధాలు కావాలి’’ అని యెర్మాక్
చెప్పారు.
తాత్కాలిక చర్యల్ని కోరుకోవడం లేదు : ‘రష్యా భూభాగంలో ఒక్క సెంటీమీటరు కూడా
మాకు అవసరం లేదు. మా భూభాగం మాకు తిరిగిరావాలని కోరుకుంటున్నాం. యుద్ధం
ముగించడానికి ఏం చేయాలో మా శాంతి ప్రణాళికలో వివరించాం. కాల్పుల విరమణ వంటి
తాత్కాలిక చర్యలను మేం కోరుకోవడం లేదు. ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా బలగాలు
పూర్తిగా వెళ్లిపోవాలి’ అని యెర్మాక్ చెప్పారు. యుద్ధం ఈ ఏడాదే ముగుస్తుందని
విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఉక్రెయిన్ తరఫున ప్రకటన విడుదలైంది. యుద్ధం
మొదలై ఏడాది కావస్తున్న తరుణంలో శాంతి కోసం అత్యవసర చర్యల తీర్మానంపై ఐరాస
సర్వప్రతినిధి సభలో గురువారం ఓటింగు జరగబోతున్న తరుణంలో డోభాల్‌తో ఆయన
మాట్లాడారు. సాధారణంగా ఇలాంటి తీర్మానాలపై ఓటింగుకు మనదేశం దూరంగా ఉంటోంది.
యుద్ధాన్ని ముగించేలా సాయం చేయండి : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించడంలో,
శాంతి నెలకొల్పడంలో భారత్ కీలక పాత్ర పోషించాలని ఫ్రాన్స్ కోరుకుంటోంది. ఈ
మేరకు ఫ్రాన్స్ దౌత్య బృందం యత్నాలు చేస్తోంది. ‘భారత్, రష్యా మధ్య కీలక
సంబంధాలు ఉన్నాయి. వాటిద్వారా శాంతిని నెలకొల్పేలా సాయం చేయాలని భారత్‌ను
కోరాం. కానీ, అది సుదీర్ఘ ప్రక్రియ’ అని ఫ్రాన్స్ వర్గాలు వెల్లడించాయి.
భారత్ ఒకవేళ ఐరాసలో ఓటింగుకు గైర్హాజరైనా ఉక్రెయిన్ సమస్యపై పనిచేస్తుందని,
వాస్తవిక ధోరణితో జరుపుతున్న చర్చల్లో దాచేందుకు ఏమీలేదని పేర్కొన్నాయి.