ఉక్రెయిన్ పై దండయాత్రకు ఏడాది పూర్తి కావొస్తున్న సందర్భంగా రష్యా అధ్యక్షుడు
వ్లాదిమిర్ పుతిన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్ లో
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకస్మిక పర్యటన మరుసటి రోజే పుతిన్ ప్రసంగం
ప్రాధాన్యత సంతరించుకుంది.
పార్లమెంటులో పుతిన్ ప్రసంగిస్తూ రష్యా సరిహద్దుల వరకు విస్తరించాలని నాటో
ప్రణాళికలు రచించిందని ఆరోపించారు. ప్రపంచం నలుమూలలా అమెరికా బలగాలు ఉన్నాయని
అన్నారు. ప్రస్తుత పరిస్థితికి పాశ్చాత్యదేశాలదే బాధ్యత అని స్పష్టం చేశారు.
శాంతియుతంగా సమస్యను పరిష్కరించడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని పుతిన్
పేర్కొన్నారు. కానీ, సమస్య పరిష్కారానికి పాశ్చాత్య దేశాలు సిద్ధంగా లేవని
ఆరోపించారు. ఉక్రెయిన్ విషయంలో పాశ్చాత్యదేశాల వల్లే సమస్య మరింత సంక్లిష్టంగా
మారిందని విమర్శించారు. యుద్ధం కోసం పాశ్చాత్యదేశాలు ఉక్రెయిన్ కు 150 బిలియన్
డాలర్లు ఇచ్చాయని ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్ కు కూడా ఇరాక్, యుగోస్లేవియా గతి
పట్టిస్తారని పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని రష్యా
పౌరులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని పార్లమెంటును ఉద్దేశించి
పేర్కొన్నారు.