ఉచిత టికెట్లు ప్రకటించిన విమానయాన సంస్థలు
అంకారా : టర్కీ, సిరియా సరిహద్దులో సంభవించిన భారీ భూకంపం వల్ల వేలాది ఇండ్లు,
భవనాలు, హోటళ్లు, రిసార్టులు, విద్యా సంస్థలు, హాస్టళ్లు నేలమట్టమయ్యాయి.
దీంతో భూకంప ప్రభావిత ప్రాంతాలను అక్కడి ప్రజలు వీడుతున్నారు. ప్రధానంగా
గాజియాంటెప్, హతాయ్, నూర్దగి, మరాష్ నుంచి వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు
తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ విమానయాన సంస్థలు ఉచిత టికెట్లు ఆఫర్
చేస్తున్నాయి. భూకంప బాధితులను తమ విమానాల్లో ఫ్రీగా సురక్షిత ప్రాంతాలకు
తరలించేందుకు ముందుకు వచ్చాయి. టర్కీ ఎయిర్లైన్స్, పెగాసస్ ఎయిర్లైన్స్
సంస్థలు ఆదివారం ఈ మేరకు ప్రకటించాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల నుంచి
ఇస్తాంబుల్, అంకారా, అంటాల్య వంటి ఇతర సురక్షిత ప్రాంతాలకు ఉచిత టికెట్లను
ఆఫర్ చేశాయి. కాలేజీ, యూనివర్సిటీ హాస్టళ్ల విద్యార్థులు, హోటళ్లు, టూరిస్ట్
రిసార్ట్లలో బస చేసిన వారు, ఇతర బాధితులను సురక్షిత ప్రాంతాలకు ఉచితంగా
తీసుకెళ్తామని వెల్లడించాయి. దీంతో గాజియాంటెప్ విమానాశ్రయానికి వేలాది మంది
భూకంప బాధితులు పోటెత్తారు. మరోవైపు తుర్కియే, సిరియా సరిహద్దులో సోమవారం
సంభవించిన భారీ భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 30,000కు చేరుతున్నది.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు గత ఆరు
రోజులుగా నిరంతరం శ్రమిస్తున్నారు. కాగా భూకంపం సంభవించి వారం రోజులు
అవుతున్నప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్న కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు.