గజియాన్తెప్: తుర్కియే, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య రోజురోజుకు
పెరుగుతున్నది. ఎక్కడ చూసినా శిథిలాల దిబ్బలు.. శవాల కుప్పలే కనిపిస్తున్నాయి.
భూకంపం ధాటికి రెండు దేశాల్లో బుధవారం నాటికి మరణించిన వారి సంఖ్య 11 వేలు
దాటింది. రెస్క్యూ సిబ్బంది రాత్రి పగలు తేడా లేకుండా సహాయక చర్యలు
కొనసాగిస్తున్నారు. తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ భూకంపం ప్రభావిత
పజార్కిక్ పట్టణంతో పాటు హతాయ్ ప్రావిన్స్‌లో పర్యటించారు. మొదటి రోజు సహాయక
చర్యలకు ఆటంకాలు కలిగాయని, ప్రస్తుతం పరిస్థితి మెరుగైందని తెలిపారు. సిరియాలో
ప్రభుత్వ అధీనంలోని ప్రాంతాల్లో 1250 మంది మరణించగా, రెబల్స్ అధీనంలోని
ఏరియాల్లో 1280 మంది చనిపోయారు. తుర్కియేలో 60 వేల సిబ్బంది సహాయక చర్యల్లో
ఉన్నారు. దాదాపు 2.3 కోట్ల మందిపై భూకంపం ప్రభావం చూపిందని, ఇది తీవ్రమైన
సంక్షోభమని డబ్ల్యూహెచ్‌వోకు చెందిన అధికారి ఒకరు పేర్కొన్నారు. భూకంపం వల్ల
సర్వస్వం కోల్పోయిన బాధితుల్లో కొంత మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక
శిబిరాల్లో తలదాచుకొంటున్నారు. మరికొంతమంది ఆరుబయటే నిద్రిస్తున్నారు.