ఆరు నెలల్లో రెండోసారి
ఈసారి 1,000 మందిని ఇంటికి పంపిన బైజూస్
కొందరికి వాట్సాప్ కాల్స్ ద్వారా సమాచారం
ఇటీవల 2,500 మందిని తొలగించిన ఎడ్ టెక్ సంస్థ
ఎడ్ టెక్ సంస్థ ‘బైజూస్’ మరోసారి ఉద్యోగులను తొలగించింది. దాదాపు 1,000 మందిని
ఇంటికి పంపింది. బైజూస్ లేఆఫ్ ప్రకటించడం గత ఆరు నెలల్లో ఇది రెండోసారి.
తాజాగా డిజైన్, ప్రొడక్షన్, ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్లలోని ఉద్యోగులను
బైజూస్ తీసేసినట్లు ‘లైవ్ మింట్’ వెబ్ సైట్ వెల్లడించింది. ఒక్క ఇంజనీరింగ్
విభాగంలోనే 300 మందిపై ఎఫెక్ట్ పడినట్లు ‘మనీ కంట్రోల్’ వెబ్ పత్రిక
వివరించింది. ఉద్యోగం నుంచి తొలగించినట్లు అధికారిక ఈమెయిల్ కూడా పంపలేదని,
కొందరికి వాట్సాప్ కాల్స్ ద్వారా తెలియజేసినట్లు చెప్పుకొచ్చింది. 2023 మార్చి
నాటికి లాభదాయక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్న బైజూస్.. ఖర్చు
తగ్గించుకునే పనిలో భాగంగా ఇటీవల 2,500 మందిని తొలగించింది. ఇదే సమయంలో
రానున్న రోజుల్లో 10 వేల మంది టీచర్లను నియమించుకుంటామని బైజూస్ కో ఫౌండర్
దివ్యా గోకుల్ నాథ్ చెప్పడం గమనార్హం. ప్రపంచంలోని అత్యంత విలువైన ఎడ్ టెక్
స్టార్టప్ లలో ఒకటిగా బైజూస్ పేరు పొందింది. ఈ సంస్థ విలువ సుమారుగా 22
బిలియన్ డాలర్లు. 2015లో దీన్ని స్థాపించారు. ప్రధాన కార్యాలయం బెంగళూరులో
ఉంది.