న్యూ ఢిల్లీ : తొలిసారిగా ముక్కు ద్వారా తీసుకునే (నాజల్) కరోనా వ్యాక్సిన్ మన
దేశంలో అందుబాటులోకి వచ్చింది. భారత్ బయోటెక్ తయారు చేసిన ఇన్ కొవాక్
వ్యాక్సిన్ ను కేంద్ర మంత్రులు మన్సుక్ మాండవీయ, జితేంద్ర సింగ్
ప్రారంభించారు. ఈ టీకాను ప్రభుత్వానికైతే ఒక్కో డోసుకు రూ.325కి, ప్రైవేటు
ఆస్పత్రులకైతే రూ.800కి సరఫరా చేయనున్నారు. ఈ నాజల్ వ్యాక్సిన్ ను రెండు
డోసులుగా 18 ఏళ్లు పైబడిన వారికి వేసేందుకు గత డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వం
అనుమతినిచ్చింది. రెండు డోసులకు మధ్య 28 రోజుల గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రస్తుతం కొవిన్ యాప్ లో ఇన్ కొవాక్ నాజల్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ
టీకాను వేయించుకోవాలనుకునే వాళ్లు కొవిన్ యాప్ లో అపాయింట్ మెంట్ బుక్
చేసుకోవాలని భారత్ బయోటెక్ సూచించింది. అయితే ఇప్పటికే ప్రికాషనరీ లేదా
బూస్టర్ డోసు వేసుకున్న వాళ్లు ఈ నాజల్ వ్యాక్సిన్ తీసుకోకూడదని కేంద్రం
నియమించిన వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ హెచ్చరించింది.