పాకిస్తాన్ : ‘‘భారత్‌తో మూడు యుద్ధాలు చేశాం. సాధించింది ఏమీ లేదు. దేశంలో
మరింత విధ్వంసం జరిగింది. నిరుద్యోగం పేదరికం మీద పడ్డాయి. యుద్ధానికి కారణమైన
కశ్మీర్ వంటి అంశాలపై భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నాం. అణ్వాయుధాలు కలిగిన
మన దేశం అన్నవస్త్రాల కోసం ప్రపంచ దేశాల ముందు దేహి అంటూ చేయి చాపడం నిజంగా
సిగ్గు చేటు. అంతర్జాతీయ సంస్థల్ని రుణాలు అడగాలన్నా ఇబ్బందిగా అనిపిస్తోంది.
ఇలా ప్రపంచ దేశాలను భిక్షమడిగి దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించడం పరిష్కారం
కాదు. ఈ వ్యాఖ్యలు చేసినది ఎవరో కాదు. సాక్షాత్తూ పాకిస్తాన్ ప్రధానమంత్రి
షెహబాజ్ షరీఫ్. రోజు రోజుకీ దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారి పోతూ ఉండడంతో
మరో దారి లేక షరీఫ్ శాంతి మంత్రం జపిస్తున్నారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలను
పునరుద్ధరించుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతామన్న భావనలో పాక్
సర్కార్ ఉంది.
గోధుమల లారీని వెంబడించి : పాకిస్తాన్లో ప్రధాన ఆహారమైన గోధుమ పిండికి
విపరీతమైన కొరత ఏర్పడింది. నిరుపేదలు గోధుమ పిండి కొనుక్కోవడానికి గంటల తరబడి
దుకాణాల దగ్గర క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో
కరాచీలో ఒక గోధుమ పిండి లారీ వెళుతూ ఉంటే దాని వెనక ప్రజలు పరుగులు తీసిన
దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఒక్క వీడియో చాలు పాక్‌లో ఆహార
సంక్షోభం ఏ స్థాయికి చేరుకుంటోందో చెప్పడానికి. బియ్యం, గోధుమలు, కూరగాయలు
డిమాండ్‌కు తగ్గ సప్లయి కావడం లేదు. ఇరుగు పొరుగు దేశాల నుంచి దిగుమతి
చేసుకోవాలంటే డాలర్ నిల్వలు తరిగిపోతున్నాయి. కరాచీలో కేజీ గోధుమ పిండి
రూ.160 ధర పలుకుతూ ఉండడంతో ప్రజలు కడుపు నింపుకోవడమెలాగ అని ఆందోళన
చెందుతున్నారు. కొన్ని రెస్టారెంట్లలో ఒక భోజనం ఖరీదు ఏకంగా రూ.800కి
చేరుకుంది. విద్యుత్ సంక్షోభంతో మార్కెట్లను, రెస్టారెంట్లను రాత్రి 8 గంటలకే
మూసేస్తూ ఉండడంతో జనం కూడా చేసేదేమి లేక త్వరగా నిద్రపోతున్నారు. దీంతో
పాక్‌లో చీకటి పడగానే విద్యుత్ వెలుగులు లేక కారు చీకట్లోకి దేశం
వెళ్లిపోతోంది.
పెట్రోల్ ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్ రూ.200కి పైనే
ఉండడంతో సామాన్యులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రాణావసరమైన మందులకి
కూడా కొరత ఏర్పడడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరాచీలో ఇన్సులిన్
లభించకపోవడంతో మధుమేహ రోగులు నానా తంటాలు పడుతున్నారు. ఇక సైనికులకి రెండు
పూటలా తిండి పెట్టే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. దేశంలో టాప్‌లో ఉన్న 8
తయారీ సంస్థలు ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు లేక మూతపడ్డాయి. ఆర్థిక సంక్షోభం
నుంచి గట్టెక్కడానికి వివిధ దేశాల్లో రాయబార కార్యాలయాలను కూడా పాక్
ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంతో ఆర్థిక సంక్షోభం పరాకాష్టకు చేరుకున్నట్టయింది.