ఇప్పటి వరకు 69 మృతదేహాలు లభ్యం
మృతుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారు అయిదుగురు
కాఠ్మాండూ: నేపాల్‌లోని పోఖారా నగరంలో ఆదివారం నేలకూలిన యతి ఎయిర్‌లైన్స్‌కు
చెందిన విమానం బ్లాక్ బాక్స్ సోమవారం లభ్యమైంది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి
సమీపంలోనే ఇది దొరికింది. ఈ విమానంలో గల 72 మందిలో 69 మంది భౌతికకాయాలను
అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాఠ్మాండూలోని త్రిభువన్ విమానాశ్రయంలో
బయలుదేరిన విమానం ఇటీవలే నూతనంగా ప్రారంభమైన స్థానిక విమానాశ్రయంలో దిగుతున్న
సందర్భంగా సేతి నదీ లోయలో కూలిపోయింది. 69 మంది మృతదేహాల్లో ఇప్పటి వరకూ 41
మందిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దుర్ఘటన నేపథ్యంలో నేపాల్‌లో
సోమవారం జాతీయ సంతాపదినంగా పాటించారు. భారత్‌కు చెందిన అయిదుగురు మృతులూ
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారుగా తేలింది. వీరిలో నలుగురు పోఖారాలో
పారాగ్లైడింగ్‌లో పాల్గొనడానికి వెళ్తున్నారని స్థానికుడు ఒకరు వెల్లడించారు.
మరొకరు పశుపతినాథ్ ఆలయంలో పూజలకు వెళ్లారు. ప్రమాదానికి గల కారణాలపై
దర్యాప్తు నివేదిక 45 రోజుల్లో రానుంది.
ఫేస్బుక్లో లైవ్ ఇచ్చిన భారత ప్రయాణికుడు : నేపాల్ విమాన ప్రమాదానికి
సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. ప్రమాదానికి ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లోని
గాజియాబాద్‌కు చెందిన సోనూ జైశ్వాల్ విమానంలో నుంచి ఫేస్బుక్ లైవ్
స్ట్రీమింగ్ ఇచ్చాడు. విమానం బయటి దృశ్యాలు, లోపల ఉన్న ప్రయాణికులు వీడియోలో
కనిపిస్తున్నారు. ఒక్కసారిగా విమానం కుప్పకూలడం, ప్రయాణికుల ఆర్తనాదాలు,
భారీగా మంటలు చెలరేగడం అందులో రికార్డైంది.
గతంలో అది కింగ్ఫిషర్కు చెందినది : నేపాల్‌లో ప్రమాదానికి గురైన ఏటీఆర్-72
విమానం గతంలో భారత్‌కు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు చెందినది కావడం
గమనార్హం. 2007లో కింగ్‌ఫిషర్ కొనుగోలు చేసిన 9ఎన్-ఏఎన్సీ
ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఆరేళ్ల అనంతరం థాయ్‌లాండ్‌కు చెందిన నాక్ ఎయిర్ సొంతం
చేసుకుంది. 2019లో దీనిని యతి ఎయిర్‌లైన్స్ కొనుగోలు చేసింది. ఏటీఆర్-72గా
వ్యవహరించే ఈ తరహా విమానం నేపాల్‌లో ప్రమాదానికి గురికావడం ఇదే తొలిసారి.