71వ ఎడిషన్ ఫైనల్లో విజేతగా నిలిచిన మిస్ యూఎస్ఏ
నిరాశ పరిచిన భారత అందగత్తె దివిటా రాయ్
ఫైనల్లో పోటీ పడ్డ 80 మంది అందగత్తెలు
అమెరికా అందగత్తె ఆర్బోనే గేబ్రియాల్ మిస్ యూనివర్స్ 2022 విజేతగా నిలిచింది.
అమెరికాలోని న్యూ ఆర్లియాన్స్‌లో మిస్ యూనివర్స్ 71వ ఎడిషన్ ఫైనల్లో వివిధ
దేశాలకు చెందిన 80 మంది అందగత్తెలను ఓడించి ఆమె కీరిటాన్ని గెలుచుకుంది.
విజేతగా ఆమె పేరును ప్రకటించిన వెంటనే 2021 మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు తన
కిరీటాన్ని గేబ్రియాల్‌కు అందించింది. ‘మీరు మిస్ యూనివర్స్ గెలిస్తే, ఇది
సాధికారత, ప్రగతిశీల సంస్థ అని నిరూపించడానికి మీరు ఎలా పని చేస్తారు?’ అని
జ్యూరీ ఆమెకు చివరి ప్రశ్న చేసింది. దీన్ని మార్పు కోసం ఒక వాహకంగా
ఉపయోగిస్తానని సమాధానం చెప్పడంతో ఆమెను కిరీటం వరించింది. ‘నేను దాన్ని
పరివర్తన నాయకురాలిగా ఉపయోగిస్తాను. నేను13 సంవత్సరాలుగా ఫ్యాషన్ డిజైనర్ గా
పని చేస్తున్నా. నేను ఫ్యాషన్‌ను మంచి కోసం శక్తిగా ఉపయోగిస్తాను. నా
పరిశ్రమలో, నేను నా దుస్తులను తయారు చేసేటప్పుడు రీసైకిల్ చేసిన పదార్థాల
ద్వారా కాలుష్యాన్ని తగ్గించుకుంటాను. మానవ అక్రమ రవాణా, గృహ హింస నుంచి
బయటపడిన మహిళలకు నేను కుట్టు తరగతులు నేర్పుతాను. దీన్ని మార్పు కోసం వాహనంగా
ఉపయోగిస్తాము’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ అందాల పోటీల్లో వెనెజులాకు చెందిన
సుందరి అమంద డుడమెల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. సెకండ్ రన్నరప్‌గా డొమెనికన్
రిపబ్లిక్కు చెందిన ఆండ్రీనా మార్టినెజ్ నిలిచింది. ఈ పోటీల్లో కర్ణాటకకు
చెందిన దివిట రాయ్ భారత్ కు ప్రాతినిధ్యం వహించింది. అయితే, ఆమెకు నిరాశే
ఎదురైంది. కేవలం టాప్ 16లో చోటు దక్కించుకొని సరిపెట్టుకుంది.