చైనాలో 30 రోజుల్లో 60 వేల మంది మృతి
కరోనా విస్ఫోటనంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనాకు తాజా అధ్యయనం మరింత
భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఈనెలాఖరు వరకు బీజింగ్‌లో దాదాపు అందరికీ వైరస్
సోకుతుందని ఈ అధ్యయనం హెచ్చరించింది. జీరో కొవిడ్ ఆంక్షలను సడలించటం వల్ల
వచ్చే 2, 3నెలల్లో కొవిడ్ తీవ్రస్థాయికి చేరుకుంటుందని నిపుణుల అంచనావేశారు.
ఇదిలా ఉండగా గత నెలలో దాదాపు 60,000 మంది కొవిడ్‌తో మృతి చెందినట్లు చైనా
నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ప్రజా ఆందోళనలతో జీరో కొవిడ్ విధానాన్ని
ఉపసంహరించుకున్న చైనాకు కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే వైరస్
విశ్వరూపం చూపిస్తుండగా తాజాగా విడుదలైన అధ్యయనం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఈనెలాఖరుకు బీజింగ్‌లో దాదాపు అందరికీ వైరస్ సోకుతుందని ఓ అధ్యయనాన్ని నేచర్
మెడిసిన్ జర్నల్ ప్రచురించింది. 2.2 కోట్ల మంది జనాభా కలిగిన బీజింగ్‌లో
డిసెంబర్ నాటికే 76 శాతం మంది వైరస్ బారిన పడినట్లు అధ్యయనం తెలిపింది.
ఈనెలాఖరు నాటికి వైరస్ బాధితులు 92 శాతానికి పెరుగుతారని వెల్లడించింది. జీరో
కొవిడ్ విధానాన్ని సడలించడం వల్ల వైరస్ పునరుత్పత్తి రేటు 3.44 కు పెరిగినట్లు
అధ్యయనం వెల్లడించింది.
కొవిడ్‌తో 60,000 మంది మృతి
చైనాలో గత నెల రోజుల్లో దాదాపు 60,000 మంది కరోనాతో మరణించారని నేషనల్ హెల్త్
కమిషన్ ప్రకటించింది. కొవిడ్ కేసులు, మరణాలపై పారదర్శకంగా సమాచారం ఇవ్వడం
లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ప్రపంచదేశాల నుంచి విమర్శలు రావటం వల్ల చైనా
నేషనల్ హెల్త్ కమిషన్ ఈ గణాంకాలను విడుదల చేసింది. కొవిడ్ కారణంగా శ్వాసకోశ
వ్యవస్థ విఫలమై 5,503 మంది, కొవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య కారణాలతో మరో 54,435
మంది మరణించినట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. మృతుల సగటు వయసు 80
ఏళ్లుగా పేర్కొంది.
మరణించిన వారిలో 90 శాతం మంది 65ఏళ్లకు పైబడిన వారేనని తెలిపింది. పీకింగ్
యూనివర్సిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2023 జనవరి 11 నాటికి చైనాలో
దాదాపుగా 900 మిలియన్ల మంది ఈ వైరస్ బారిన పడినట్లు తెలిపింది. దేశ జనాభాలో 64
శాతం మందికి వైరస్ సోకినట్లు అంచనా వేసింది. ఈ అధ్యయనం గాన్సూ రాష్ట్రంలో 91
శాతం మంది ప్రజలకు ఆ వైరస్ సోకి అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది.
యున్నాయ్ 84 శాతం, కింగ్ హై 80 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నట్లు
నివేదించింది. ఒమిక్రాన్ ఉప వేరియంట్ బి.ఎఫ్.7 ద్వారా దెబ్బతిన్న బీజింగ్, ఏడు
మరణాలను ప్రకటించింది. అయితే ఆ తర్వాత కేసులు, మరణాల డేటాను ప్రకటించడం
ఆపివేసింది. శ్వాసకోశ సమస్యతో మరణించిన కోవిడ్ రోగులను మాత్రమే అధికారిక మరణాల
సంఖ్యగా లెక్కించనున్నట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది.