15 మంది కేబినెట్ మంత్రులు ఓడిపోయే అవకాశం
బ్రిటన్‌లో తాజాగా వెలువడిన సర్వే
లండన్ : బ్రిటన్ లో వచ్చే ఏడాది జరగబోయే సాధారణ ఎన్నికల్లో ప్రధాని రిషి
సునాక్ సహా 15 మంది కేబినెట్ మంత్రులు ఓడిపోయే అవకాశముందని తాజా సర్వే ఒకటి
అంచనా వేసింది. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి
వ్యక్తిగా ఘనత సాధించిన రిషి సునాక్ కు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా?
బ్రిటన్‌లో తాజాగా వెలువడిన సర్వే అదే చెబుతోంది. సునాక్ సహా ప్రస్తుత
కేబినెట్లో ఉన్న 15 మంది మంత్రులు 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో తమ స్థానాల
నుంచి ఓడిపోయే ప్రమాదముందని పేర్కొంది.
*సీనియర్ టోరీ (కన్జర్వేటివ్ పార్టీ) సభ్యుల్లో ప్రధాని సునాక్ , ఉప ప్రధాని
డొమినిక్ రాబ్, ఆరోగ్య మంత్రి స్టీవ్ బార్క్లే, విదేశాంగ మంత్రి జేమ్స్
క్లెవర్లీ, రక్షణ మంత్రి బెన్ వాలాస్ తదితరులు వచ్చే ఎన్నికల్లో తమ స్థానాలను
కోల్పోవచ్చని బ్రిటన్‌లోని బెస్ట్ ఫర్ బ్రిటన్ చేపట్టిన ఫోకల్‌డేటా
పోలింగ్ ఫలితాలు చెబుతున్నాయి. కేవలం ఐదుగురు కేబినెట్ మంత్రులు జెరెమి
హంట్, భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్, మైఖెల్ గోవ్, నదీమ్
జవావీ, కెమీ బడెనోచ్ మాత్రమే 2024 ఎన్నికల్లో గెలిచే అవకాశాలున్నాయని ఈ
సర్వేలో తేలింది. ఇక గత కొన్ని దశాబ్దాలుగా పార్టీల గెలుపులో కీలకంగా
మారుతున్న 10 స్థానాలు ఈసారి లేబర్ పార్టీ వశమయ్యే అవకాశాలున్నట్లు బెస్ట్
ఫర్ బ్రిటన్ అధ్యయనం వెల్లడించింది. ఈ పది స్థానాల్లో ఏ పార్టీ విజయం
సాధిస్తే ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. గత కొంతకాలంగా
కన్జర్వేటివ్ పార్టీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆర్థిక సంక్షోభం, వలసలు,
ద్రవ్యోల్బణం అధికార పార్టీకి సవాల్‌గా మారుతున్నాయి.
దీనికి తోడు నెలల వ్యవధిలో ముగ్గురు ప్రధానులు మారడంతో ప్రజల్లో వ్యతిరేకత
మొదలైంది. ఈ క్రమంలోనే ఇటీవల వెలువడిన ఎన్నికల్లో సర్వేల్లో కన్జర్వేటివ్
పార్టీ కంటే లేబర్ పార్టీ 20 పాయింట్ల ముందంజలో ఉంది. దీంతో, టోరీ
భవితవ్యాన్ని మార్చేందుకు సునాక్ ఈ ఏడాది ఆరంభం నుంచే తీవ్రంగా
శ్రమిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు
ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది మే నెలలో యూకే లో స్థానిక ఎన్నికలు
జరగనున్నాయి. ప్రధానిగా సునాక్‌కు తొలి ఎన్నికల పరీక్ష ఇది. ఆ ఎన్నికల్లో
విజయం సాధించలేకపోతే పార్టీ అధ్యక్ష బాధ్యతలను మళ్లీ మాజీ ప్రధాని బోరిస్
జాన్సన్‌కు అప్పగించాలని కొందరు టోరీ సభ్యులు భావిస్తున్నట్లు వార్తలు
వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పోల్ డేటా సునాక్ నాయకత్వంపై అనుమానాలు
రేకెత్తిస్తోంది.