శాన్ఫ్రాన్సిస్కో: భారీవర్షాలు, ఈదురుగాలులతో ‘బాంబ్ సైక్లోన్’
కాలిఫోర్నియా రాష్ట్రాన్ని గజగజా వణికించింది. ఆకస్మికంగా వరదనీరు
పోటెత్తడంతో 1,80,000 ఇళ్లు, పరిశ్రమలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
సునోమా కౌంటీలో ఓ ఇంటిపై చెట్టు కూలడంతో రెండేళ్ల చిన్నారి మృతిచెందింది.
ఫెయిర్ఫీల్డ్లో ఓ యువతి (19) నడుపుతున్న వాహనం జలమయమైన రోడ్డులో చిక్కుకొని
ఓ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఆమె మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. 2018లో
తీరప్రాంతంలోని మాంటెసీటో పట్టణంలో ఇలాగే భారీవర్షాలకు మట్టిచరియలు
విరిగిపడటంతో 23 మంది మృతిచెందారు. మరోమారు అలాంటి ఉపద్రవం ఎదురవకుండా
అధికారులు ఆ ప్రాంతంలోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. 72 కిలోమీటర్ల మేర ఉన్న
తీరప్రాంత హైవేను మూసివేశారు. ఉత్తరాన అనేక చెట్లు నేలకూలడంతో 40 కిలోమీటర్ల
మేర ఉన్న 101 హైవేపై కూడా రాకపోకలు నిలిపివేశారు. రోడ్లు జలమయం అయ్యే అవకాశం
ఉన్న ప్రాంతాల్లో స్థానికులు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచనలు జారీ
చేస్తున్నారు. గంటకు 136 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో
శాన్ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 70కు పైగా విమాన సర్వీసులను
రద్దు చేశారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ నూజమ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ
ప్రకటించారు. ‘గత అయిదేళ్లలో మేము ఎదుర్కొన్న తుపాన్లలో ఇది అత్యంత
తీవ్రమైనదిగా భావిస్తున్నాం’ అని కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయంలోని
ఎమర్జెన్సీ సర్వీసుల డైరెక్టర్ నాన్సీ వార్డ్ తెలిపారు. ‘మేము యుద్ధానికి
సిద్ధపడుతున్నాం’ అని శాన్ఫ్రాన్సిస్కో మేయర్ లండన్ బ్రీడ్
వ్యాఖ్యానించారు. మూసుకుపోయిన కాలువలను సిబ్బంది మరమ్మతు చేస్తున్నారు.
స్థానికులకు ఇసుక బస్తాలను అందజేస్తున్నారు. తుపాను తాకిడికి ఇళ్లు
కోల్పోయినవారిని రక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. కరవు పీడిత రాష్ట్రమైన
కాలిఫోర్నియాలో గత వారం రోజుల్లో ఇది మూడో తుపాను.