వియన్నా: ఐరోపా, అమెరికాలకు నచ్చకపోయినా సరే రష్యా నుంచి చమురు దిగుమతి
చేసుకుంటూనే ఉంటామని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆస్ట్రియా జాతీయ
ప్రసార సంస్థ ఓఆర్ఎఫ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు. రష్యా నిరుడు
ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై దండెత్తినప్పుడే ఐరోపా దేశాలు ఎందుకు చమురు
దిగుమతులను బంద్ చేయలేదని ప్రశ్నించారు. అప్పటి నుంచి అవి భారత్ కన్నా ఆరు
రెట్లు ఎక్కువగా రష్యన్ చమురును దిగుమతి చేసుకున్నాయని ఆయన గుర్తు చేశారు.
ఐరోపా దేశాలు తమ ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో రష్యన్ చమురు దిగుమతులను
క్రమక్రమంగా తగ్గించుకొంటూ వచ్చాయన్నారు.
60,000 యూరోల తలసరి ఆదాయం గల ఐరోపా దేశాలు తమ ప్రజల ప్రయోజనాల కోసం అంతగా
శ్రద్ధ తీసుకొంటున్నప్పుడు, కేవలం 2,000 డాలర్ల తలసరి ఆదాయం గల భారతీయుల
ప్రయోజనాల గురించి తామెంత శ్రద్ధ వహించాలని జైశంకర్ ప్రశ్నించారు. చమురుకు
ఎక్కువ ధర పోసే స్థితిలో భారత్ లేదని చెప్పారు. ఐరోపా దేశాలు రష్యా నుంచి
చమురు దిగుమతులు తగ్గించి పశ్చిమాసియా నుంచి కొంటున్నందున మార్కెట్లో వాటి
ధరలు పెరిగిపోతున్నాయన్నారు. ఒకప్పుడు భారత్కు కేవలం 0.2 శాతం చమురు
దిగుమతులు రష్యా నుంచి వస్తే ఇప్పుడవి 20 శాతానికి చేరుకున్నాయి. సరిహద్దుపై
భారత్తో కుదుర్చుకున్న ఒప్పందాలను చైనా ఉల్లంఘించినందునే ఉద్రిక్తతలు
పెరుగుతున్నాయని జైశంకర్ పేర్కొన్నారు. భారతదేశంపై పాక్ రెచ్చగొడుతున్న
సీమాంతర ఉగ్రవాదాన్ని చూసి ప్రపంచం ఆందోళన చెందాలని హెచ్చరించారు. పాకిస్థాన్
నగరాల్లో బాహాటంగానే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నడుస్తున్నా ఆ సంగతి అక్కడి
ప్రభుత్వానికి తెలియదనుకోవాలా? అని ప్రశ్నించారు.