వారం రోజులు ప్రయాణికులు అందులోనే
అడుగున పెద్ద ఎత్తున నాచు, సూక్ష్మజీవులు పేరుకుపోవడంతోనే
ఆస్ట్రేలియా సముద్ర జలాల్లో ఘటన
సిడ్నీ: నూతన సంవత్సర సందడి వేళ ఓ విలాస నౌక ప్రయాణికులకు భయంకర అనుభవం
ఎదురైంది. క్రూయిజ్ నౌక అడుగున ముందు భాగంలో సముద్ర జలాల్లోని నాచు, చిన్న
మొక్కలు, సూక్ష్మజీవుల్లాంటి జీవ వృథా(బయోఫౌల్) పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో
వందల మంది ప్రయాణికులు వారం రోజుల పాటు నడి సంద్రంలో నౌకలోనే చిక్కుకుపోయారు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఈ ఘటన
చోటుచేసుకుంది. చివరకు గజ ఈతగాళ్ల సాయంతో బయోఫౌల్‌ను తొలగించడంతో నౌక తిరిగి
ప్రయాణాన్ని ప్రారంభించినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ
వర్గాల సమాచారం ప్రకారం వైకింగ్ ఆరియన్ అనే నౌక గత డిసెంబరు 23న
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ తీరం నుంచి సముద్ర జలాల్లోకి వెళ్లింది. 9
అంతస్తుల ఈ నౌకలో 930 పడకలున్నాయి. డిసెంబరు 26న న్యూజిలాండ్ రాజధాని
వెల్లింగ్టన్కు వచ్చి వెళ్లింది. తీరానికి వచ్చి బయోఫౌల్‌ను శుభ్రం
చేసుకోవడానికి ప్రయాణ మార్గంలోని తదుపరి మూడు రేవుల నుంచి అనుమతి లభించలేదు.
దీంతో దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ సమీపంలో సముద్ర జలాల్లోనే ఉండిపోయింది.
హానికరమైన బయోఫౌల్‌ను తొలగించకపోతే తమ సముద్ర జలాలు విషపూరితమయ్యే
ప్రమాదముండటంతో దాన్ని శుభ్రం చేసే చర్యలు చేపట్టినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం
పేర్కొంది. నౌక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ పూర్తవడంతో సాయంత్రానికి
నౌక మెల్బోర్న్ రేవుకు చేరుకోబోతున్నట్లు తెలిపింది.