తెరుచుకున్న విమానాశ్రయం
రోడ్లపై ప్రయాణాలకు అనుమతి
బఫెలో : కొన్ని రోజులుగా మంచు తుపాను ధాటికి కకావికలమైన న్యూయార్క్
రాష్ట్రంలోని బఫెలో నగరం క్రమంగా తేరుకుంటోంది. ప్రధాన రహదారులపై మంచును
స్థానిక సిబ్బంది యుద్ధప్రాతిపదికన తొలగించడంతో రోడ్డు ప్రయాణాలపై నిషేధాన్ని
ఎత్తివేస్తున్నట్లు నగర మేయర్ ప్రకటించారు. నేషనల్ గార్డ్ సిబ్బంది
బుధవారం నగరంలోని ప్రతి ఇంటికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. విద్యుత్
సరఫరా, ఆహారం, తాగునీరు, వైద్య సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. అవసరమైన
వారికి అక్కడికక్కడే నిత్యావసరాలను అందించారు. ఈ ఘోరకలి వల్ల పశ్చిమ
న్యూయార్క్ ప్రాంతంలో ఇప్పటికే 36 మంది మరణించారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే
అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. ఇక్కడి పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది మంచులో
చిక్కుకుపోయిన వారి కోసం గాలిస్తున్నారు. ఐదు రోజుల మూసివేత తర్వాత నయాగరా
విమానాశ్రయం తెరుచుకున్నప్పటికీ చాలా వరకు విమాన సర్వీసులను పునరుద్ధరించాల్సి
ఉంది. నగరానికి స్వల్ప స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉందని జాతీయ వాతావరణ సంస్థ
తెలిపింది. అజాగ్రత్తగా ఉండకూడదన్న ఉద్దేశంతో వరదను ఎదుర్కొనేలా అధికారులు
ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.