ఉక్రెయిన్‌కు వరంగా మారనున్న ‘పేట్రియాట్’
ధర సుమారు.7,500 కోట్లు
అభివృద్ధి చేసింది అమెరికాకు చెందిన రేథియాన్ టెక్నాలజీస్ కార్పొరేషన్
దీని రాడార్ పరిధి 150 కిలోమీటర్లకు పైగా
రష్యా-ఉక్రెయిన్ యుద్దం మొదలై 10 నెలలు దాటింది. పుతిన్ బలగాల ధాటికి తొలినాళ్లలో కకావికలమైన జెలెన్స్కీ సేన క్రమంగా పుంజుకుంటోంది! ప్రత్యర్థి దాడులను తిప్పికొడుతూనే ఎదురుదాడులు కూడా చేపడుతోంది. అయితే ఆయుధ సంపత్తిలో ఉక్రెయిన్‌పై రష్యాది స్పష్టమైన పైచేయి. అందుకే తమకు ఆయుధాలు, ఇతర రక్షణ వ్యవస్థలను అందించాలంటూ అమెరికా సహా పశ్చిమ దేశాలను జెలెన్స్కీ పదేపదే కోరుతున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఆయన ఇటీవల అమెరికాలో పర్యటించారు కూడా. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అమెరికా తాజాగా తీపి కబురు అందించింది. ఆ దేశానికి దాదాపు రూ.13,500 కోట్ల సైనిక సాయాన్ని ప్రకటించింది. అందులో భాగంగా అత్యాధునిక పేట్రియాట్ క్షిపణి వ్యవస్థను అందించనున్నట్లు తెలిపింది. ప్రధానంగా రష్యా నుంచి దూసుకొస్తున్న డ్రోన్లను సమర్థంగా నిలువరించేందుకు ఈ రక్షణ వ్యవస్థ దోహదపడే అవకాశాలున్నాయి.
ఏమిటీ పేట్రియాట్ ? : పేట్రియాట్ అనేది ‘ఫేజ్డ్ అర్రే ట్రాకింగ్ రాడార్ ఫర్ ఇంటర్సెప్ట్ ఆన్ టార్గెట్’కు సంక్షిప్త రూపం. ఉపరితలం నుంచి గగనతలంలోకి క్షిపణులను ప్రయోగించే రక్షణ వ్యవస్థ ఇది. శత్రు బలగాల నుంచి దూసుకొచ్చే క్షిపణులు/డ్రోన్లను అడ్డుకొని, వాటిని నిర్వీర్యం చేసేలా దీన్ని తీర్చిదిద్దారు. ప్రపంచంలోకెల్లా అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థల్లో ఇదొకటి. ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకునేందుకు వీలుగా పలు వెసులుబాట్లు కల్పించారు.
ఎలా పనిచేస్తుంది? : రాడార్లు, కమాండ్-కంట్రోల్ సాంకేతికత, వివిధ రకాల ఇంటర్సెప్టార్ల (పీఏసీ-2, పీఏసీ-3 వంటివి) ప్యాకేజీ వంటిది పేట్రియాట్. ఇవన్నీ కలిసికట్టుగా పనిచేయడం ద్వారా శత్రు బలగాల వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు, ఆధునిక విమానాలు, ఇతర ప్రమాదాలను గుర్తించి అడ్డుకుంటాయి.
తొలిసారి ఎక్కడ మోహరించారు : పేట్రియాట్‌ను 1991 గల్ఫ్ యుద్ధంలో తొలిసారి ఉపయోగించారు. అప్పట్లో సౌదీ అరేబియా, కువైట్, ఇజ్రాయెల్‌లకు రక్షణగా మోహరించారు.
ప్రస్తుతం ఏయే దేశాలు వినియోగిస్తున్నాయి: అమెరికాతో పాటు మరో 17 దేశాలు పేట్రియాట్‌ను వినియోగిస్తున్నాయి. ఈ జాబితాలో జర్మనీ, నెదర్లాండ్స్, జపాన్, ఇజ్రాయెల్ తదితర దేశాలున్నాయి.