యుద్ధం ముగిస్తామంటూ పుతిన్ ప్రకటించిన కొన్ని రోజుల్లోనే రష్యా విదేశాంగ మంత్రి ఉక్రెయిన్పై బెదిరింపులకు దిగారు. యుద్ధాన్ని ముగించాలంటే మా షరతులు ఏమిటో ఉక్రెయిన్ కు బాగా తెలుసని, వాటిని పూర్తిచేస్తే ఆ దేశానికే మంచిదని లేకపోతే తమ సైన్యం నిర్ణయిస్తుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీలావ్రోవ్ నేరుగా హెచ్చరించారు. ఈ విషయాన్ని రష్యాకు చెందిన టాస్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని త్వరలోనే ముగిస్తామంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ ప్రకటన రావడం గమనార్హం. ‘‘వారి పాలనలో నిస్సైనికీకరణ, నాజీరహితంగా చేసి అక్కడి నుంచి రష్యా కు ఉన్న ముప్పును తొలగించాలన్నది మా ప్రతిపాదన. వీటితోపాటు కొత్తగా మాకు వచ్చిన భూభాగాల్లో కూడా ఇలా చేయాలి. ఈ విషయాలు మా ప్రత్యర్థికి తెలుసు. ఇది చాలా సింపుల్ పాయింట్. మీ మంచికే వాటిని పూర్తి చేసుకోండి. లేకపోతే ఈ విషయాన్ని రష్యా సైన్యం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం బంతి వారి కోర్టులో ఉంది. వారి వెనక వాషింగ్టన్ ఉందని ఉక్రెయిన్ను లావ్రోవ్ హెచ్చరించారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ మాస్కో చర్చలకు సిద్ధంగా ఉంటే వాషింగ్టన్ మద్దతుతో కీవ్ మాత్రం వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఇదే సమయంలో రష్యా మిత్రదేశమైన భారత్ సంధికి సాయం చేస్తుందని ఉక్రెయిన్ విశ్వసిస్తోంది. ఈ క్రమంలో మోదీ-జెలెన్స్కీ నిన్న టెలిఫోన్లో మాట్లాడుకున్నారు. యుద్ధనేరాలకు బాధ్యులైనవారిని శిక్షించడం, ఉక్రెయిన్ నుంచి రష్యా బలగాలన్నింటినీ ఉపసంహరించడం, తమ ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించడం వంటి 10 అంశాల శాంతి ప్రణాళికను మోదీకి వివరించినట్లు జెలెన్స్కీ చెప్పారు. ఆహార, ఇంధన, అణు భద్రతకు భరోసాను కోరుతున్నట్లు ఆయన తెలిపారు.