జెలెన్స్కీకి ప్రధాని నరేంద్ర మోడీ సూచన
ఘర్షణకు కళ్లెంవేసి, వెంటనే యుద్ధాన్ని విరమించేందుకు రష్యా, ఉక్రెయిన్లు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ఇరువర్గాలూ చర్చలు ప్రారంభించి, విభేదాలను పరిష్కరించుకోవాలని, దీర్ఘకాలిక పరిష్కారాలకు బాటలు వేయాలని సూచించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం ఫోన్లో మోదీతో మాట్లాడారు. శాంతి ప్రయత్నాల్లో ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తామని, బాధిత ప్రజలకు మానవతాసాయం ఇచ్చేందుకూ కట్టుబడి ఉన్నామని జెలెన్స్కీకి మోదీ చెప్పారు. ఉక్రెయిన్లో చదువుకుంటూ భారతదేశానికి తిరిగి వచ్చేసిన విద్యార్థుల విద్యాభ్యాసం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. జి-20 కూటమికి మోదీ సారథ్యం విజయవంతంగా సాగాలని తాను ఆకాంక్షించినట్లు జెలెన్స్కీ తెలిపారు. ‘‘ఇదివరకు జి-20 వేదిక నుంచే నేను శాంతి సూత్రాన్ని ప్రతిపాదించాను. దాని అమలుకు మద్దతు ఇవ్వండి. ఈ విషయంలో భారత్ భాగస్వామ్యంపై నాకు విశ్వాసం ఉంది. ఐరాసలో భారత్ మాకు మద్దతు ఇచ్చినందుకు కూడా మోదీకి కృతజ్ఞతలు తెలిపాను’’ అని ఆయన ట్వీట్ చేశారు. యుద్ధనేరాలకు బాధ్యులైనవారిని శిక్షించడం, ఉక్రెయిన్ నుంచి రష్యా బలగాలన్నింటినీ ఉపసంహరించడం, తమ ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించడం వంటి 10 అంశాల శాంతి ప్రణాళికను మోదీకి వివరించినట్లు చెప్పారు. ఆహార, ఇంధన, అణు భద్రతకు భరోసాను కోరుతున్నట్లు తెలిపారు.