ఒక్కో నగరంలో ఐదేసి లక్షల కేసులు
కిటకిటలాడుతున్న ఆస్పత్రులు, మార్చురీలు
అందుబాటులోకి ఇంటర్నెట్ వైద్య సేవలు
బీజింగ్ : చైనాలో కరోనా కల్లోలం నానాటికీ ఉగ్ర రూపు దాలుస్తోంది. దేశవ్యాప్తంగా లక్షలాదిగా కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రజాందోళనలకు తలొగ్గి జీరో కొవిడ్ పాలసీని ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటి నుంచీ ఒమిక్రాన్ వేరియంట్లు దేశమంతటా కార్చిచ్చు కంటే వేగంగా వ్యాపిస్తున్నాయి. డిసెంబర్ 1–20 తేదీల మధ్య కనీసం 25 కోట్ల మంది కరోనా బారిన పడ్డట్టు జాతీయ ఆరోగ్య కమిషన్ నుంచి లీకైన డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది! దాంతో రోగులతో ఆస్పత్రులు, శవాలతో మార్చురీలు నిండిపోతున్నాయి. వాటిపై భారం తగ్గించేందుకు ఇంటర్నెట్ ఆస్పత్రి సేవలను ప్రభుత్వం అనుమతించింది. వీలైనంత వరకూ ఆన్లైన్లో వైద్య సాయం పొందాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. అత్యవసర కరోనా మందులకు చాలాచోట్ల తీవ్ర కొరత నెలకొంది. దాంతో బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
సిబ్బందికీ కరోనా : చైనాలో పలు నగరాల్లో సగటున రోజుకు లక్షకు పై చిలుకు చొప్పున కేసులు వెలుగు చూస్తున్నాయి! తూర్పున షాన్డాంగ్ ప్రావిన్సులో క్విండావో నగరంలోనైతే రోజుకు ఏకంగా 5 లక్షల మంది కరోనా బారిన పడుతున్నారని నగర హెల్త్ కమిషన్ చీఫ్ బో తావో చెప్పారు! మున్ముందు పరిస్థితి మరింత విషమించేలా కన్పిస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. దక్షిణాదిన గువాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో డాంగువాన్ నగరంలోనూ రోజుకు 3 లక్షలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. రోగుల్లో చాలావరకు వృద్ధులేనని తెలుస్తోంది. మరోవైపు చాలాచోట్ల వైద్య సిబ్బంది కూడా ఇప్పటికే కరోనా బారిన పడ్డట్టు సమాచారం. అయినా ఒకవైపు చికిత్స తీసుకుంటూనే వారంతా విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు.