వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి
గుంటూరు : మిగతా జిల్లాల మాదిరిగానే మాచర్లలో కూడా రాజకీయపక్షాల మధ్య
ఉద్రిక్తతలు, హింసాకాండ ఈనాటివి కావని వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి
అన్నారు. అందుకే జిల్లా పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని
పరిస్థితి అదుపుతప్పకుండా కాపాడింది. ఏ జిల్లాలో శాంతి, భద్రతల సమస్య
తలెత్తినా ఆ జిల్లా పోలీస్ సూపరింటిండెంట్ ను నిందించడం, ఆయన నేతృత్వంలోని
పోలీసు బలగాల పనితీరును తప్పుపట్టడం ఓ ఆనాయితీగా మారింది. ఈ క్రమంలో మాచర్ల
పట్టణంలో గొడవలకు తమ తెలుగుదేశం తమ్ముళ్లు ఎంత వరకు కారకులో సమీక్షించుకుని,
ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇక్కడి
జిల్లా ఎస్పీపై విరుచుకుపడుతున్నారు. కారాలు మిరియాలూ నూరుతున్నారు.
ప్రతిపక్షాలు చేపట్టే ఆందోళన కార్యక్రమాలు శ్రుతిమించి సాధారణ ప్రజానీకానికి
తలనొప్పి కాకుండా ఉండడానికి ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు సాధ్యమైనంత
వరకూ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. లా అండ్ ఆర్డర్ విషయంలో ఉదాశీన వైఖరి
అవలంభించే అధికారులపై చర్యలకు సైతం వెనుకాడడం లేదు. రాజకీయ కొట్లాటలు, అశాంతి
విషయంలో ఇంతటి పకడ్బందీ వైఖరితో ముందుకు సాగుతున్న ప్రభుత్వంపై చంద్రబాబు
ఆరోపణలు నిరాధారం. మళ్లీ మాచర్ల విషయానికి వస్తే. శనివారం గొడవ కారణంగా జిల్లా
ఎస్పీ తీరు బాగోలేదని అంటూ, ఆయన సీటులో ఏ హోంగార్డును కూర్చోబెట్టినా సమర్ధంగా
పనిచేసేవాడని మాజీ ముఖ్యమంత్రి చెప్పడం ఆయన అవగాహనా రాహిత్యానికి, మతిమరుపునకు
నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో, విభజిత ఏపీలో మొత్తం కలిపి పద్నాలుగేళ్లు సీఎంగా
పనిచేసిన ఈ పెద్దమనిషి తాను చెప్పిన రీతిలో పోలీసు శాఖలో ఎన్ని ప్రయోగాలు
చేశారో చెబితే ప్రజలు సంతోషిస్తారు. ‘జిల్లా ఎస్పీ–హోంగార్డు పద్ధతి’లో ఆయన
తాను పాలించిన రోజుల్లో అన్ని శాఖల్లో కూడా ఇలాంటి నూతన ఒరవడులు ప్రవేశపెట్టి
ఉంటే జనం నిజంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేవారు. అందుకే ఇక ముందు ఇలాంటి
ప్రయోగాలు చేసే అవకాశం ఆంధ్రా జనం చంద్రబాబుకు ఇవ్వరు గాక ఇవ్వరు. ఇక ముందు
ఎక్కడ శాంతి, భద్రతల సమస్య తలెత్తినా పైన చెప్పిన వింత సూచనలు చేయకుండా టీడీపీ
అగ్రనేత నోర్మూసుకుంటే మంచిది. హైదరాబాద్ లో ‘అభివృద్ధి కేంద్రం’ పెట్టేలా
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కి నచ్చజెప్పగలిగిన ఈ ‘గొప్ప నాయకుడు’ లా
అండ్ ఆర్డర్ విషయంలో ఎన్నిసార్లు బోల్తాపడ్డారో తెలుగు ప్రజలకు తెలియని
విషయం కాదని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.