సెంచూరియన్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ హరిచందన్
విజయవాడ :ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో భారతదేశం
సమూలమైన మార్పుకు చేరువలో ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
అన్నారు. రానున్న మూడు, నాలుగు సంవత్సరాలలో భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల
ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్న ప్రధాని ప్రతిజ్ఞ కు అనుగుణంగా దేశం
మరింతగా సాంకేతిక అభివృద్ది సాధించవలసి ఉందన్నారు. విజయనగరంలో శనివారం జరిగిన
సెంచూరియన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ 2వ స్నాతకోత్సవంలో
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్‌భవన్ నుండి దృశ్యశ్రవణ మాధ్యమ
విధానంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి హరిచందన్
మాట్లాడుతూ దేశం నిర్ధశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం కోసం విధ్యార్ధులు
క్రియాశీలకం కావాలన్నారు. క్వాంటం కంప్యూటింగ్, కంప్యూటేషనల్ ఫార్మసీ,
స్మార్ట్ అగ్రికల్చర్, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి డిజిటల్ పరివర్తనలపై
దృష్టి సారించాలన్నారు. జన్ ధన్-ఆధార్-మొబైల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ దేశంలోని
పేదలకు సులువైన ప్రత్యక్ష ప్రయోజన బదిలీ మార్గాన్ని చూపిందని, ఈ విషయంలో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు.
కరోనా పర్యవసానాల ఫలితంగా కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధికి అవసరమైన
కాలపరిమితిని తగ్గించడానికి క్వాంటం కంప్యూటింగ్, కంప్యూటేషనల్ ఫార్మసీ
విధానాలు సహకరించాయన్నారు. సెంచూరియన్ యూనివర్శిటీ 50 మందికి పైగా పరిశ్రమ
భాగస్వాములతో అత్యాధునిక టెక్నాలజీ డొమైన్లపై సాంకేతిక విద్యలో క్రియాశీలకంగా
ఉండటం శుభ పరిణామమన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ
విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నందుకు సంతోషిస్తున్నానన్నారు. వైదిక
సంస్కృతితో పాటు స్థానిక సంస్కృతులపై దృష్టి సారించి, భూమి యొక్క వైభవాన్ని
తిరిగి వెలికితీసేందుకు విశ్వవిద్యాలయం కృషి చేయాలని సూచించారు.
విశ్వవిద్యాలయంలో 94 ఏళ్ల అచార్య శాంతమ్మ వేద శాస్త్రంలో గొప్ప కృషి
చేస్తున్నారని తెలుసుకుని సంతోషిస్తున్నానన్నారు. విజయవాడ రాజ్‌భవన్ నుండి
గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజయనగరం
విశ్వవిద్యాలయం వేదికగా కులపతి డాక్టర్ డిపి పట్టానాయక్, యూనివర్సిటీ
ప్రెసిడెంట్ డాక్టర్ ముక్తికాంత మిశ్రా, వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డిఎన్
రావు, విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సేవాలా నాయక్ ముడే, వైస్
ఛాన్సలర్ డాక్టర్ జి.ఎస్.ఎన్. రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ రమణారావు, ఇతర
ప్రముఖులు పాల్గొన్నారు.