పల్నాడు ప్రాంతంలో ఇప్పటికే రైతుల్ని బెదిరిస్తున్నారు
ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే కార్యక్రమం
రాష్ట్ర రైతాంగం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది
పోలీసు శాఖ సహకరించాలి
మాచర్ల దాడుల్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి
గుంటూరులో మీడియాతో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
గుంటూరు : జనసేన పార్టీ రైతు భరోసా కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నాలు
మానుకోవాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కోరారు.
పల్నాడు ప్రాంతంలో ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే అక్కడ కార్యక్రమం
నిర్వహించ తలపెట్టినట్టు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పోలీసు శాఖ
సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రోడ్లు మూసేస్తాం. ఎవరూ వెళ్లడానికి
వీల్లేదు అని రైతుల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. రాష్ట్ర ప్రజానీకం
కోసం, రైతాంగం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు అండగా
నిలవాలని కోరారు. మాచర్లలో చోటు చేసుకున్న దాడులు అప్రజాస్వామికం అన్నారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ కార్యక్రమాలు చేసుకొనే హక్కు అందరికీ ఉందనీ, ఈ హక్కుకి
భంగం కలిగించకూడదన్నారు. మాచర్ల ఘటనలను ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఈ
దాడిని ఖండించాలన్నారు. శనివారం గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో
మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “సత్తెనపల్లి వేదికగా ఆదివారం జనసేన
పార్టీ నిర్వహించే కౌలు రైతు భరోసా సభ మధ్యాహ్నం 12 గంటలకే మొదలుపెట్టాలని
నిర్ణయించాం. ప్రతి జిల్లాలో మాదిరి ఇక్కడ ఆత్మహత్యలు ఊహించిన దానికంటే
ఎక్కువగా ఉంటాయని భావించాం. క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత వచ్చిన వివరాలు
చూస్తే ఆ సంఖ్య వందల్లో ఉంది. పవన్ కళ్యాణ్ ప్రతి కుటుంబాన్ని ఓదార్చి స్వయంగా
రూ. లక్ష ఆర్ధిక సాయం అందించాల్సి ఉంటుంది కాబట్టి కార్యక్రమాన్ని అనుకున్న
సమయానికి ముందుకు జరపాలని నిర్ణయించాం. పవన్ కళ్యాణ్ ప్రతి కుటుంబాన్ని
ఓదార్చి, ఆర్ధిక సాయం చేయడంతో పాటు రాష్ట్ర రైతాంగానికి భరోసా నింపేందుకు
వస్తున్నారు. బటన్లు నొక్కుకుంటూ పాలన అద్భుతంగా జరుగుతుందని చెబుతూ ఈ
ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసింది. క్షేత్ర స్థాయిలో ఎక్కడా రైతులకు
భరోసా లేదు. వర్షాలకు పంటలు నష్ట పోయి 8 రోజులు గడచినా పంట నష్టం అంచనా
వేసేందుకు ఒక్క అధికారి కూడా పొలాల మధ్యకు వెళ్లలేదు. వ్వవసాయ రంగాన్ని
కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి భారత పౌరుడికీ ఉంది. ఇక్కడేమో ముఖ్యమంత్రి బాధ్యత
లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్ధమయ్యే రీతిలో
జనసేన పార్టీ తరఫున కార్యక్రమాలు చేస్తున్నాం.
మానవత్వం ఉంటే రూ. 7 లక్షలు పరిహారం ఇవ్వండి
సత్తెనపల్లి కౌలు రైతు భరోసా సభలో 280 మందికి రూ. లక్ష చొప్పున ఆర్ధిక
సాయాన్ని పవన్ కళ్యాణ్ అందచేస్తారు. పల్నాడు ప్రాంతంలో వలసలు ఎక్కువగా
ఉన్నాయి. ఇక్కడే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే కొంత మంది
రైతులకు బెదిరింపులు మొదలయ్యాయి. పల్నాడు ప్రాంతంలో గతంలో ఇతర జిల్లాల్లో ఏ
విధంగా ప్రణాళికాబద్దంగా రైతు భరోసా యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారో అదే
విధమైన కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు,
ప్రజానీకం కౌలు రైతుల కుటుంబాల్లో భరోసా నింపేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని
ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. ఇలాంటి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు బెదిరింపులు
లాంటి పిచ్చి ఆలోచనలు చేయరాదు. మానవత్వం ఉంటే రూ.7 లక్షల పరిహారం చెల్లించి ఆ
కుటుంబాలను ఆదుకునే వారు. ప్రభుత్వం అధికారికంగా 1600 మంది ఆత్మహత్య
చేసుకున్నట్టు చెబుతోంది. క్షేత్ర స్థాయిలో చూస్తే ఆ సంఖ్య 3 వేలు ఎప్పుడో
దాటేసింది. ఆ కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి బాధ్యతగల
రాజకీయ పార్టీగా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం. రైతుల్ని భయబ్రాంతులకు
గురి చేస్తున్నారు. ఆంక్షలతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవద్దు. పోలీసులు ఇటువంటి
కార్యక్రమానికి సహకరించాలని కోరుతున్నాం. వైసీపీ వ్యక్తిగత విమర్శలు
మానుకోవాలి. గుంటూరు జిల్లా ప్రజానీకం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘనస్వాగతం
పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. రోడ్లు మూసేస్తాం.. జీపుల్లో, బస్సుల్లో జనసేన
కార్యక్రమానికి వెళ్లవద్దు అని అడ్డుకోవద్దు.
మాచర్ల దాడులు ప్రజాస్వామ్యానికి దెబ్బ
మాచర్లలో నిన్నటి దాడులు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి.
ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు తెలియచెప్పే బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంటుంది.
రాజకీయపరమైన కార్యక్రమాలు చేసుకునే హక్కు అందరికీ ఉంది. అధికారాన్ని
అడ్డుపెట్టుకుని దాన్ని అడ్డుకోవడం దారుణం. ఘర్షణ వాతావరణం సృష్టించవద్దు.
వైసీపీ శాశ్వత అధికారం లక్ష్యంతో ఈ విధంగా ముందుకు వెళ్తోంది. మీరు చేసే
కార్యక్రమాలను బట్టి ప్రజలు ఎవరికి ఓటు వేయాలని ఆలోచించి వేస్తారు. ప్రైవేటు
ఆస్తులు, వ్యక్తులపై దాడులు భావ్యం కాదు. మాచర్ల సంఘటన దురదృష్టకరం” అన్నారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, శ్రీ గాదె
వెంకటేశ్వరరావు, నేరెళ్ల సురేష్, నయూబ్ కమాల్, బేతపూడి విజయ్ శేఖర్,
అమ్మిశెట్టి వాసు, బండారు రవికాంత్, పార్వతీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.