సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు తాత్కాలిక స్టే..
కోర్టు ధిక్కార కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
(టీటీడీ ఈవో) ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన
ఆదేశాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం స్టే విధించింది. ఉద్యోగుల
క్రమబద్ధీకరణ విషయంలో టీటీడీ ఈవోకు నెల రోజుల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ
సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. దీనిపై ఈవో ధర్మారెడ్డి హైకోర్టు డివిజన్
బెంచ్ ను ఆశ్రయించారు. తాజాగా శుక్రవారం జరిగిన విచారణలో సింగిల్ జడ్జి
తీర్పుపై డివిజన్ బెంచ్ తాత్కాలిక స్టే విధించింది. తమను క్రమబద్ధీకరించేలా
టీటీడీ ఈవోను ఆదేశించాలంటూ ముగ్గురు ఉద్యోగులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని విచారించిన సింగిల్ జడ్జి ధర్మాసనం ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు
చెప్పింది. వారిని క్రమబద్ధీకరించాలని టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేసింది. ఈ
ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం జరిగింది. దీనిపై ఉద్యోగులు మరోసారి కోర్టును
ఆశ్రయించారు. దీంతో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ టీటీడీ ఈవో
ధర్మారెడ్డికి సింగిల్ జడ్జి ధర్మాసనం నెల రోజుల సాధారణ జైలు శిక్ష
విధించింది. దాంతో పాటు రూ.2 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సింగిల్
జడ్జి తీర్పుపై ఈవో ధర్మారెడ్డి హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బెంచ్ సింగిల్ జడ్జి తీర్పుపై తాత్కాలికంగా
స్టే విధించింది.*