పాత్రికేయులకు ఉచిత వైద్యశిబిరంలో వక్తలు
విజయవాడ : ‘యువ భారతానికి యువ గుండెలు చాలా అవసరం..యువత తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అత్యంత ముఖ్యమైంది. తమపై ఒక కుటుంబం ఆధారపడి ఉందన్న విషయాన్ని నేటి యువత గుర్తు చేసుకోవాలి…’ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో జర్నలిస్ట్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జే శాప్), రోటరీ క్లబ్ ఆఫ్ ఇండియా, యంగ్ హార్ట్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు గుండె పరీక్షల వైద్య శిబిరం జరిగింది. యువత ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతున్నారంటూ వక్తలు అభిప్రాయపడ్డారు. యువత తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. విజయవాడ పూర్వపు సబ్ కలె కుమారుడు కిరణ్ తేజ పిన్న వయస్సులోనే గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఇలాంటి విషాదకర సంఘటన మరో కుటుంబంలో జరగకూడదన్న లక్ష్యంతో ‘యంగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆఫ్ చదలవాడ కిరణ్ తేజ మెమోరియల్ ట్రస్ట్’ (కేటీసీ) ఏర్పాటు చేసి యువతకు గుండె జబ్బులపై సిహెచ్.భానుప్రసాద్ అవగాహన కలిగిస్తున్నారు.
ఉచిత వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం జే శాప్, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడతో కలసి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిద్ధార్థ వైద్య కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ జి.ఈశ్వర్ మాట్లాడారు. యువతను గుండె జబ్బుల బారి నుంచి కాపాడేందుకు సిహెచ్.భానుప్రసాద్ ముందుకు రావటం అభినందనీయమని కొనియాడారు. దురలవాట్ల కారణంగా యువత జీవితకాలం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన కొన్ని సర్వేల్లో యువతలో 2 శాతం మంది రక్తపోటు, 1 శాతం మధుమేహం బారిన పడుతున్నారని గుర్తించారన్నారు. అనారోగ్యం అనేది మన అలవాట్ల వల్లే వస్తుందన్నారు. అర్ధరాత్రి వరకు ఫుడ్ కోర్టుల్లో రకరకాల ఆహార పదార్థాలు దొరుకుతున్నాయని ఉదయం 6 తరువాత ఆహారం తీసుకుంటే అది అమృతమని అదే రాత్రి 8 తరువాత తీసుకుంటే అది విషతుల్యమని అన్నారు. యంత్రాలకైనా కొంత సమయం విశ్రాంతి ఇవ్వాలని మనిషి కూడా యంత్రమేనని వారికి కూడా విశ్రాంతి తప్పనిసరిగా ఉండాలని సూచించారు. చాలా మంది యువత నాకేమి వ్యాధులు లేవనే అపోహలో ఉంటారని కానీ అకస్మాత్తుగా వచ్చే గుండె పోటు ఎంతో మంది యువతను బలి తీసుకుందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని తమ ఆరోగ్యం కోసం కేటాయించాలని డాక్టర్ జి.ఈశ్వర్ పేర్కొన్నారు.
కిరణ్ తేజ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, పూర్వపు సబ్ కలెక్టర్ సిహెచ్.భానుప్రసాద్ మాట్లాడుతూ అమెరికాలో 11 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇండియా వచ్చిన నా కుమారుడు ఒక రోజు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారని ఇది మా కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచివేసిందన్నారు. మరో కుటుంబంలో ఇలా జరగకుండా ఉండేందుకు యంగ్ హార్ట్స్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువతను ఎంపిక చేసి వారికి ముందుగా ప్రాథమిక పరీక్షలు చేస్తామని ఆరోగ్యపరమైన సమస్యలను గుర్తిస్తే ఇతర పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహిస్తామన్నారు. తీవ్రమైన అనారోగ్యం ఉంటే వారికి ఆరోగ్యశ్రీ లేదా ట్రస్ట్ ద్వారా వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. ప్రతి నెలా క్యాంపులు నిర్వహించి అవసరమైన వారికి వైద్యం అందిస్తానని హామీ ఇచ్చారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ ఎంసి.దాస్ మాట్లాడుతూ యువత ఎక్కువ మంది గుండెజబ్బుల బారిన పడుతున్నారని తెలిపారు. 2021-22లో 1.79కోట్ల మంది యువత గుండెజబ్బులతో మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో తెలిపిందని ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు. యువతను కాపాడుకునేందుకు మనమంతా కలసి కట్టుగా ముందుకు వెళ్లాలని కోరారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షుడు డాక్టర్ నాగరాజు కాజ మాట్లాడుతూ యువత ఎక్కువ మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని గుర్తు చేశారు. వారికి వైద్యపరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
దీనికి రోటరీ క్లబ్ తరపున సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. రమేష్ ఆసుపత్రి సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ హెచ్.ఎస్.సోమనాథ్ మాట్లాడుతూ నేటి యువతరాన్ని గుండెజబ్బుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ పి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యం గురించి పది మందికి చెప్పగలిగే స్థితిలో ఉన్న పాత్రికేయులు తాముజాగ్రత్తగా ఉంటూనే ఇతరులకు కూడా జాగ్రత్తలు చెప్పాలని కోరారు. వైద్యుల సలహా మేరకు రెగ్యులర్ గా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జే శాప్ అధ్యక్షుడు తాడేపల్లి రత్నాకర్ మాట్లాడుతూ పాత్రికేయులకు ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు ముందుకు వచ్చిన రమేష్ ఆసుపత్రి సిబ్బందికి, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, యంగ్ హార్ట్స్ ఫౌండేషన్,కిరణ్ తేజ ఛారిటబుల్ ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూ ఎడిటర్ ధారా గోపి, జే శాప్ ఉపాధ్యక్షుడు డి.రవికాంత్, ఏపీ హైకోర్టు బార్ కౌన్సెల్ కోశాధికారి డాక్ జంధ్యాల శాస్త్రి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ మమత తదితరులు వైద్య సలహాలు అందించారు.