రాష్ట్రం లో వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసేందుకు ప్రధానమంత్రి మోదీ,
సీఎం జగన్ విచ్చేయడంతో విశాఖపట్నం శనివారం హోరెత్తింది. ఈ సందర్బంగా సీఎం జగన్
మాట్లాడుతూ.. ఆంధ్రా అభివృద్ధికి బాటలు వేసేందుకు తామిద్దరం సమష్టిగా
పనిచేస్తున్నామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రం మధ్య సంబంధాలు
చాలా స్నేహపూర్వకంగా ఉన్నాయని సీఎం జగన్ నొక్కిచెప్పారు, ‘కేంద్రంతో మా
అనుబంధం రాజకీయాలకు అతీతమైనది.. మాకు రాష్ట్ర అభివృద్ధి తప్ప మరో ఎజెండా లేదు’
అని ఉద్ఘాటించారు .
విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో శనివారం జరిగిన భారీ బహిరంగ సభలో
జగన్ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు
చెందిన అనేక కీలక సమస్యలను పరిష్కరించాల్సిందిగా ప్రధానిని కోరారు. విభజనకు
సంబందించిన హామీల గురించి మాట్లాడుతూ పోలవరం నుంచి ప్రత్యేకహోదా వరకు, విశాఖ
స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ ఏర్పాటు వరకు మీరు పెద్ద మనసుతో రాష్ట్ర
ప్రజల శ్రేయస్సు కోసం పరిష్కరించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయంలో ప్రతి రూపాయిని, కేంద్రం కేటాయించిన నిధులను
పూర్తి పారదర్శకతతో ప్రజల సంక్షేమం కోసం సక్రమంగా వినియోగిస్తున్నామన్నారు.
విద్య, వ్యవసాయం, మహిళా సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని
సీఎం జగన్ పేర్కొన్నారు. వైద్యం, ఆరోగ్యం, సామాజిక న్యాయం, అభివృద్ధి
వికేంద్రీకరణ వంటి ఉన్నతమైన లక్ష్యాలతో కేవలం 3.4 సంవత్సరాల వ్యవధిలో రాష్ట్రం
అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోందన్నారు. 10,742 కోట్ల విలువైన ప్రాజెక్టులకు
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినందుకు ప్రజల తరపున ప్రధానమంత్రికి
హృదయపూర్వక శుభాకంక్షాలు తెలియజేశారు .
దేశ నిర్మాణంలో ఆంధ్ర ప్రదేశ్ కీలక పాత్ర..
రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశ నలుమూలలా
అనేక విజయాలను సాధిస్తున్నారని ప్రశంసించారు. అది కేవలం నైపుణ్యం వల్లే సాధ్యం
కాదని, వారిలో ఉన్న కలుపుగోలు తనం, స్నేహశీలత వల్లే ప్రపంచం లో వివిధ
రంగాల్లో రాణించగలుగుతున్నారని కొనియాడారు. విద్య, వ్యవస్థాపకత, సాంకేతికత,
వైద్య వృత్తి ఇలా ఏదైనా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి రంగంలో తమకంటూ ఒక
ప్రత్యేక పేరు తెచ్చుకున్నారన్నారు. ఈ గుర్తింపు వృత్తిపరమైన లక్షణాల ఫలితంగా
మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజల సంకల్పం కారణంగా కూడా ఉందన్నారు.
దేశాభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుందని కొనియాడారు.
రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ చేస్తున్న పనుల వల్ల దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో
ఉందని, రాష్ట్ర అభివృధికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని, జగన్ కోరిన
విధంగా పోలవరం, రైల్వే జోన్ పూర్తి చేస్తూ రాష్ట్రంలో చేపట్టబోయే ఇతర
ప్రాజెక్టులకు తాము అండగా ఉంటామని ప్రధాని మోడీ తెలియచేశారు.