వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అనంతపురం నగరం గుత్తి రోడ్డులోని కేటీఆర్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ‘అభివృద్ధి వికేంద్రీకరణ జేఏసి’ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విశ్వేశ్వరరెడ్డి, అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి అధ్యక్షుడు కేవీ రమణ,బార్ కౌన్సిల్ సభ్యుడు ఆలూరు రామిరెడ్డి, ఏపీపీఎస్సి మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి వికేంద్రీకరణ ఒక్కటే ఏకైక మార్గమని చెప్పారు.
రాజధానికి సంబంధించి శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను అప్పటి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండానే ముందుకెళ్లడంతోనే ఈ సమస్య తలెత్తిందన్నారు.రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పాలన వికేంద్రీకరణ అవసరమన్నారు. 29 గ్రామాల కోసం సమస్య సృష్టించడం సరికాదన్నారు. అమరావతి అభివృద్ధికి ఐదు నుంచి పదేళ్లు పడుతుందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు అయితే అమరావతి అభివృద్ధికి రూ.5 లక్షల కోట్లు అవసరమవుతాయన్నారు. మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరగాలన్నారు.మేధావులందరూ ఐక్య కార్యాచరణతో మూడు రాజధానులపై ప్రజావాణి వినిపించాలని కోరారు. సమావేశంలో వికేంద్రీకరణ సాధన సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.