వెలగపూడి, ప్రధాన ప్రతినిధి : ఎన్నికల నియమావళికి విరుద్ధంగా బహిరంగ సభలలో మాట్లాడుతున్న చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ బృందం కోరింది. ఈ మేరకు సోమవారం వెలగపూడి సచివాలయం నందు సీఈవో ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ పైన, రాష్ట్ర ప్రభుత్వంపైన కూటమి పార్టీలు విషాన్ని కక్కుతున్నాయని మల్లాది విష్ణు మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నానాటికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇసుక, మద్యం, గంజాయి, గొడ్డలి అంటూ బహిరంగ సభలలో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ.. మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా ఈనెల 5 వ తేదీన బహిరంగ సభలలో టీడీపీ అధినేత చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరమని మల్లాది విష్ణు అన్నారు. బచ్చా అని, కొమ్ములు విరుస్తానంటూ తంబళ్లపల్లి సభలో.. అమ్మ మొగుడు అంటూ ధర్మవరం సభలో సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వీటిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదును అందజేసినట్లు చెప్పారు. అలాగే అభ్యర్థులను పోలుస్తూ పచ్చ పత్రికలలో వస్తున్న టీడీపీ పెయిడ్ ఆర్టికల్స్ పైనా ఈసీకి ఫిర్యాదును అందజేసినట్లు తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కూటమి అభ్యర్థులతో కలవడంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదును అందజేసినట్లు తెలిపారు. అలాగే ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా, వాస్తవాలకు భిన్నంగా చేస్తున్న ఫేక్ సర్వే రిపోర్టులపైనా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియజేశారు.
రైతుల పట్ల బాబుకు చిత్తశుద్ధి లేదు
రైతుల పట్ల చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మల్లాది విష్ణు ఆరోపించారు. పట్టాదారు పాస్ పుస్తకాన్ని చించి తగులబెట్టారంటేనే.. రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల బాబుకు ఉన్న గౌరవం అర్థమవుతోందన్నారు. వ్యవసాయం దండగ అంటూ గతంలోనూ ఇదేరీతిలో అన్నదాతలను బాబు అవమానించారని.. అమరావతి రైతులను సైతం మోసగించారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు బాబుకు ఏమాత్రం పట్టవని మల్లాది విష్ణు విమర్శించారు. ఒక్కసారైనా కేంద్ర పెద్దల వద్ద రాష్ట్ర ప్రయోజనాల గూర్చి ప్రస్తావించారా..? సమాధానం చెప్పాలన్నారు. కూటమికి ఓ అజెండా అంటూ లేదని.. ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపడమే వారి ప్రధాన అజెండాగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రంగాలలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక అప్పుల ఆంధ్రప్రదేశ్ అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎఫ్ఆర్బీఎంకు లోబడే రాష్ట్ర అప్పులు ఉన్నట్లు కేంద్రమే పలు సందర్భాలలో స్పష్టం చేయడం జరిగిందన్నారు. అయినా మంచి చేస్తున్న ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని.. ఈ ఎన్నికలలో కూటమికి మరోసారి గట్టి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, వైసీపీ లీగల్ సెల్ సభ్యులు శ్రీనివాసరెడ్డి ఉన్నారు.