ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించేవి
ఇప్పుడున్న పథకాలు కొనసాగాలంటే జగన్కు ఓటు వేయాలి
చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోవాలి
చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే
రేపల్లె నుంచి ప్రత్యేక ప్రతినిధి : ఎన్నికలు సమీపిస్తుండడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బాపట్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని రేపల్లెలో రోడ్ షోలో పాల్గొన్నారు. రేపల్లెలో ఉన్న అంబేద్కర్ సెంటర్ ఈ రోడ్ షోకు వేదికైంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మండుటెండను సైతం లెక్క చేయకుండా తన కోసం తరలివచ్చిన జనాలకు కృతజ్ఞతలు తెలిపారు. మరో వారం రోజుల్లో జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావన్నారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలని తెలిపారు. జగన్కు ఓటు వేస్తే ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయని, అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనని పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమేనని జగన్ ఎద్దేవా చేశారు. సాధ్యం కాని హామీలను గుప్పించి మోసం చేస్తున్నారని, ప్రతిఒక్కరూ ఈ విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల దీవెనలతో తన 59 నెలల పాలనలో గతంలో ఎన్నడూ చూడని మార్పులు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. రూ. 2.70 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి, నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వం తమదేనని అన్నారు. ఇక వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన పథకాలను ఈ సందర్భంగా సీఎం మరోసారి గుర్తు చేశారు. అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇలా ఇంటికే వచ్చే పాలనగానీ, పథకాలుగానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. అలాగే అన్నదాతల సంక్షేమం కోసం చేపట్టిన రైతుభరోసా, పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ వంటి వాటిని కూడా ప్రస్తావించారు. ఆటోలు, ట్యాక్సీలు నడుపుతున్న డ్రైవర్ల కోసం వాహన మిత్ర, నేతన్నల కోసం నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, లాయర్లు లా నేస్తం ఇలా ప్రతిఒక్కరికీ ఏదో ఒక పథకం తీసుకొచ్చి ఆదుకున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగిన దాఖలాలు లేవన్నారు. అటు పేదల ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకుని ఆరోగ్యశ్రీని విస్తరించినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. నాడు-నేడు పేరిట ఇంగ్లీష్ మీడియం బడులు, గ్రామానికే ఫైబర్ గ్రిడ్, డిజిటల్ లైబ్రరరీ, అక్కచెల్లెమ్మల కోసం దిశ యాప్ ఇలా గతంలో లేని ఎన్నో మంచి కార్యక్రమాలను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచిపని కూడా గుర్తు రాదని జగన్ విమర్శించారు. ఆయన పేరు చెబితే ఒక్క మంచి పథకం కూడా పేదోడికి గుర్తు రాదని, ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఆయన అధికారంలోకి వస్తే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన ఈ పాంప్లెంట్ (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) చూస్తే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. అందులో పేర్కొన్న హామీలను ఈ సందర్భంగా జగన్ చదివి వినిపించారు. ఇందులో ఒక్క హామీ కూడా చంద్రబాబు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. మళ్లీ ఇప్పుడు పొరపాటున ఆయనకు ఓటు వేస్తే అప్పటి పరిస్థితినే వస్తుందని, జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు