జై భీమ్ రావ్ భారత్ పార్టీ పశ్చిమ అభ్యర్థి పరసా సురేష్ కుమార్
విజయవాడ బ్యూరో ప్రతినిధి: పశ్చిమ నియోజకవర్గం ప్రజల సమస్యలపై సమగ్ర అవగాహన ఉన్న తనను గెలిపిస్తే పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని జై భీమ్ రావ్ భారత్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పరసా సురేష్ కుమార్ చెప్పారు. మంగళవారం చిట్టినగర్ లోని తన ఎన్నికలకు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలు తిష్ట వేసుకుని ఉన్నాయని, అయినా పాలకులు ఆయా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. పశ్చిమ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి ధన బలంతో ప్రజల ఓట్లు కొని గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. ఇటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం సరైనది కాదని ఆయన అన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జలీల్ ఖాన్ కూడా బ్యాంకులను మోసం చేసిన సుజనా చౌదరికి మద్దతు ప్రకటించడం సరైనది కాదని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీని కోటు గుర్తుపై ఓటు ముద్ర వేసి గెలిపించాలని సురేష్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.