కళ్ళకు గంతలతో గాంధీ నాగరాజన్ నిరాహార దీక్ష
విజయవాడ బ్యూరో ప్రతినిధి : రాష్ట్రంలో మద్య నిషేధం వెంటనే అమలు చేస్తేనే ఎన్నికల్లో 100% పోలింగ్ జరుగుతుందని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ చెప్పారు. మంగళవారం ఊర్మిళా నగర్ లోని గాంధీ ట్రస్ట్ కార్యాలయంలో మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేసిన 30వ తేదీని పురస్కరించుకొని దానికి నిరసనగా కళ్ళకు నల్ల రిబ్బన్ కట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు గాంధీ నాగరాజన్ నిరాహార నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటినుండే దేశవ్యాప్తంగా, అలాగే రాష్ట్రంలోనూ మద్య నిషేధాన్ని అమలు చేయాలని తాను ఎన్నికలు కమిషన్కు గతంలో లేఖ రాయడం జరిగిందనీ అన్నారు. అయితే తన సూచనను పరిగణన లోకి తీసుకోపోవడం దారుణమని అన్నారు. కేవలం పోలింగ్ తేదీకి ముందు వెనక రోజుల్లో మద్య నిషేధాన్ని అమలు చేయడం వల్ల ఆశించిన ఫలితం రాదని అన్నారు. మద్యపానం వల్ల దేశంలో కోట్లాది కుటుంబాలు నాశనం అవుతున్నాయని గాంధీ నాగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బాధ్యురాలు బంగారు భారతి తదితరులు పాల్గొన్నారు.