కూటమి మేనిఫెస్టో పై వైసిపి రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ విమర్శలు
విజయవాడ బ్యూరో ప్రతినిధి : ఎన్నికల కోసం చంద్రబాబు దగాకోరు హామీలతో మేనిఫెస్టో తయారుచేసి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ కుమార్ ఘాటుగా విమర్శించారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అలవికాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని ఆకుల ధ్వజమెత్తారు. గత 20 14 ఎన్నికల సందర్భంగా అధికారం కోసం 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిలో ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేశాడని విమర్శించారు. అందుకే ఈసారి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాని మోడీ బొమ్మ లేకుండా బీజేపీ నాయకులు జాగ్రత్త పడ్డారని ఎద్దేవా చేశారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాపీ కొట్టి ఇక్కడ అమలు చేస్తామని చంద్రబాబు చెబుతున్నారని, అందుకే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడానికి బిజెపి రాష్ట్ర ఇంచార్జి సిద్ధార్థ నాథ్ కూడా ఇష్టపడలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు తెలుగుదేశం బిజెపి జనసేన ను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ సీఎం జగనన్న సారధ్యంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలంతా కోరుతున్నారని ఆయన అన్నారు. సీఎం జగనన్న నాయకత్వంలో రాష్ట్రం స్వర్ణ యుగం వైపు ప్రయాణిస్తుందని ప్రజలు నమ్ముతున్నారని ఆకుల పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ ఎంపీ సీట్ తో పాటు ఏడు అసెంబ్లీ సీట్లు వైసిపి కైవసం చేసుకుంటుందని ఆకుల శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.