ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
వచ్చిన 15 రోజుల్లోనే డోన్ లో మళ్లీ మొదలైన రౌడీయిజం
గత ఐదేళ్లలో డోన్ నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక్క గొడవ జరిగిందా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 టీడీపీ కుటుంబాలు
బోయవాండ్లపల్లె వాల్మీకి గుహల్లో ‘కోట్ల’ను దింపి మరీ అభివృద్ధి చూపిస్తా
చండ్రపల్లె టీడీపీ నాయకుడు నాగేశ్వరయాదవ్ పై మంత్రి బుగ్గన చండ్రనిప్పులు
గుడిపాడులో మంత్రి బుగ్గనకు అపూర్వ స్పందన
పుట్టిన ఊరుకు రోడ్డేయలేని మీరు డోన్ లో అభివృద్ధి గురించి మాట్లాడతారా?
జక్కసానికుంట్లకు రమ్మన్న’కోట్ల’కు మంత్రి బుగ్గన ప్రతిసవాల్
కారు డ్రైవర్ లేకుండా వచ్చి చెప్పిన ఊరు వెళ్లి రావాలని ఛాలెంజ్
ప్యాపిలి ఎన్నికల ప్రచారంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
నంద్యాల జిల్లా బ్యూరో ప్రతినిధి : డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి కావాలో..అరాచకమే రావాలో ప్రజలు నిర్ణయించుకునే సమయం వచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఇద్దరు ‘కే’లు వచ్చిన 15 రోజుల్లోనే మళ్లీ డోన్ లో రౌడీయిజం మొదలైందన్నారు. గత ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్క ఘర్షణ అయినా జరిగిందా అని ప్రజలను మంత్రి బుగ్గన ప్రశ్నించారు. జక్కసానికుంట్ల గ్రామానికి రావాలని సవాల్ విసిరిన ‘కోట్ల’కు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతి సవాల్ విసిరారు. కారు డ్రైవర్ లేకుండా వచ్చి చెప్పిన ఊరు వెళ్లి రావాలని ఛాలెంజ్ విసిరారు. డోన్ మొత్తం తిప్పి అభివృద్ధి చూపిస్తా..ప్రస్తుత ప్రభుత్వం కట్టినవి చూడడానికే వారికి వారం పడుతుందన్నారు. బోయవాండ్లపల్లె వాల్మీకి గుహల్లో ‘కోట్ల’ను దింపి మరీ అభివృద్ధి చూపిస్తానన్నారు. 40 ఏళ్లు రాజకీయాలలో ఉన్నా తాగునీటి ఎద్దడిపై ఎందుకు శ్రద్ధపెట్టలేదో చెప్పాలన్నారు. రూ.351 కోట్లు వెచ్చించి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేసి మరో నెల రోజుల్లోనే తాగునీటి సమస్యకు ముగింపు పలుకుతామన్నారు. ఆడపడుచులు నీటి కోసం బిందెలు పట్టుకుని పోయే పరిస్థితి లేకుండా ఇంటింటికి తాగునీరివ్వనున్నట్లు చెప్పారు. డోన్ అంటే అభివృద్ధి..అభివృద్ధి అంటే డోన్ లా మార్చామని మంత్రి తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 టీడీపీ కుటుంబాలు
మంత్రి బుగ్గన సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జక్కసానికుంట్ల గ్రామంలో ప్రచారం సందర్భంగా 20 టీడీపీ కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాయి. అనంతరం జలదుర్గం గ్రామం నుంచి 50 కుటుంబాలు చండ్రపల్లె గ్రామంలో మంత్రి బుగ్గన సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. చండ్రపల్లెలో 10 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరాయి. మంత్రి ఎన్నికల ప్రచారం నిమిత్తం గుడిపాడు వెళ్తుండగా మార్గమధ్యలోనే డోన్ మండలంలోని కొత్త బురుజు గ్రామం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి 20 కుటుంబాలు చేరాయి.ఆర్థిక మంత్రి బుగ్గన నాయకత్వంలో జరిగిన అభివృద్ధి నచ్చి తాము పార్టీలో చేరుతున్నట్లు ఆయా గ్రామస్తులు పేర్కొన్నారు.
మూడేళ్లలోనే ఇన్ని నిర్మాణాలు అభివృద్ధి కావా?
పుట్టిన ఊరుకే రోడ్డేయలేని ‘కోట్ల’ డోన్ లో అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. హుస్సేనాపురం గ్రామంలో కళాశాల భవనాలు నిర్మాణాలు అభివృద్ధి కావా అని మంత్రి బుగ్గన ప్రశ్నించారు.నల్లమేకలపల్లి, బోయవాండ్లపల్లి, గుడిపాడు, పీఆర్ పల్లి గ్రామాలకు రోడ్లు అభివృద్ధి కాదా? అనడిగారు. గత 40 ఏళ్లు మీరు పట్టించుకోని ఎన్నో ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించామన్నారు. 77 చెరువులకు నీరు నింపే కార్యక్రమంలో భాగంగా ప్యాపిలి మండలంలో చెరువులు నింపడం నిజం కాదా అన్నారు. ప్రతిపక్షాలు చెప్పే ఊహల హామీలు, కట్టుకథలను ప్రజలు నమ్మవద్దన్నారు. గత ప్రభుత్వాల పాలనతో మన పరిపాలన పోల్చుకుని ప్రజలు ఆలోచించి మరీ మంచి చేసిన వారిని ఎన్నుకోవాలన్నారు. దశాబ్ధాల కాలం ప్రస్తుత ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నపుడు ఏం సాధించాయి? ప్రజలకేం చేశాయో చెప్పాలన్నారు. జగన్ హామీలను కొనసాగిస్తామననడమా చంద్రబాబు అనుభవం? అని ప్రశ్నించారు. వృద్ధ్యాప్య పింఛన్ 3500 కు పెంపు, రైతులకు 16,000 సాయం, మహిళలకు చేయూత కింద రూ.1,20,000 సాయం వంటి హామీలు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఇచ్చే ప్రతి హామీ కేవలం అధికారానికే తప్ప ఆచరణకు కాదన్నారు. జగన్ చేసినదానికి రెట్టింపు చేస్తానని ఉత్త మాటలే తప్ప ఒక్కటైనా సొంతంగా చంద్రబాబు చేసి ప్రజలు మెచ్చిన పథకం ఉందా అన్నారు. బచ్చా అన్న జగన్ అన్నకు భయపడి చంద్రబాబు తమ ఉనికి కోసం కూటమి కట్టారని ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు.
కొట్లాటలు, చిచ్చులు, ఘర్షణలేనా ప్రతిపక్షాలు చేసే అభివృద్ధి?
ప్రజలకు అండగా నిలవడం, అభివృద్ధి చేయడం డోన్ లో విపక్షాల వల్ల కాని పని అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. కొట్లాటలు, చిచ్చులు, ఘర్షణలేనా ప్రతిపక్షాలు చేసే అభివృద్ధి అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్యాపిలిలో పది పది జీపులతో ఘర్షణలు రేపి అలజడి సృష్టించిన టీడీపీ నాయకుడు నాగేశ్వరరావు యాదవ్ పై మంత్రి బుగ్గన మండిపడ్డారు. సరైన వాడు దొరక్క ఇలాంటి అరాచకాలు చేస్తున్నారని, పిచ్చి చేష్టలు చేస్తూ సామాన్యులపై బెదిరింపులకు దిగితే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాజరాజేశ్వరి సంస్థ పేరుతో పేదల మరుగుదొడ్ల నిర్మాణాల్లో డబ్బులు దండుకున్న నీచులకు మీరేం భయపడాల్సిన పనిలేదని మంత్రి పేర్కొన్నారు. దశాబ్ధాల కాలం ప్రస్తుత ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నపుడు ఏం చేశారు? చెప్పాలన్నారు. కోవిడ్ కాలంలో ప్రజలను కాపాడుకోవడానికే మా ప్రభుత్వం అప్పు చేసిందని..గత ప్రభుత్వాలు విపత్తులు లేకున్నా ఎందుకు అన్ని అప్పులు చేసిందో చెప్పాలన్నారు. బాధ్యత తీసుకునే వారిని ఆలోచించి మరీ ఎన్నుకోవాలని మంత్రి బుగ్గన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్యాపిలి మండలంలోని జక్కసానికుంట్ల, నల్లమేకలపల్లె, చండ్రపల్లె, గుడిపాడు గ్రామాలలో సోమవారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీలుగా చీలి, కులాల మధ్య చిచ్చు పెట్టి, వర్గాలుగా కేసులు పెట్టించి అమాయక జనాలను మీ చుట్టూ తిప్పుకునే ఫ్యాక్షన్ రాజకీయాలకు ఇద్దరు ‘కే’లు తెరతీశారన్నారు. రాజకీయ కొట్లాటలు పెట్టి ఇపుడు అధికారం కోసం ఒక్కటైతే నమ్మడానికి ప్రజలేం చెవిలో పెట్టుకోలేదన్నారు. పదేళ్లుగా ప్రశాంతంగా గడుపుతున్న డోన్ లో పాత కక్షలు రేపి అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమన్నారు.