విజయవాడ బ్యూరో ప్రతినిధి : న్యాయవాదుల సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. విజయవాడ బార్ అసోసియేషన్ ను సోమవారం సుజనా సందర్శించారు. సుజనాకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి అరిగాల శివరామ ప్రసాద్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సుజనా చౌదరి ముఖాముఖి మాట్లాడి సలహాలు సూచనలు స్వీకరించారు. వైసీపీ పాలనలో ఏపీ అధోగతి పాలైందని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి పునర్నిర్మాణం, ఏపీ అభివృద్ధికి చేపట్టే కార్యాచరణను వివరించారు. ఢిల్లీలో ఉన్నప్పుడు విభజన సమస్యల కోసం పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. నూతలపాటి వెంకటరమణ, కోకా సుబ్బారావు, కనకమేడల రవీంద్ర వంటి వారు న్యాయవాద వృత్తిలో అగ్రస్థానానికి వెళ్లారని ప్రస్తావించారు. న్యాయవాదులకు ఎల్లవేళలా అండగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
న్యాయవాదులు ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయమని కోరగా ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే సుజనా ట్రస్ట్ నుంచి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో విజ్ఞతతో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సుజనా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ లీగల్ సెల్ ప్రముఖ్ కె.మల్లికార్జున మూర్తి,
బీజేపీ ఎన్టీఆర్ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ జన్ను శ్రీధర్, మువ్వల జయప్రకాష్, యు.శ్రీనివాసరాజు, పీడీఎస్ నారాయణ, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.