కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం ఎదురు గ్రామంలో గుడి నిర్మించాలంటే టీడీపీ అనుమతి తీసుకోవాలా అని ఎమ్మెల్యే సుధాకర్ మండిపడ్డారు. ఎదురూరు గ్రామంలో గుడి నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో విష్ణువర్ధన్ రెడ్డి వర్గం కొడుమూరును నాశనం చేసిందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎదురూరు గ్రామంలో గుడి కట్టాలన్న ప్రజల కోరిక మేరకు తమ వంతు ప్రయత్నం చేస్తుంటే టీడీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుమూరులోని స్థానిక కార్యాలయంలో ఎమ్మెల్యే సుధాకర్ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడి కావాలంటే టీడీపీ ఎందుకు అడ్డుపడుతుందని ప్రశ్నించారు. గడప గడపకు వెళ్ళినప్పుడు గ్రామ ప్రజలు గుడి కావాలని అడిగారని, దీనిపై గ్రామ ప్రజలు, వేద పండితుల సలహాలు తీసుకున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎక్కడా గుడి లేదని, గ్రామ ప్రజలు వినాయక, శివాలయం, రామాలయం కావాలని అడిగినట్లు పేర్కొన్నారు. కానీ విష్ణువర్ధన్ రెడ్డి అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆయనను చూసి ఎవరూ ముందుకు రావడం లేదని మండిపడ్డారు. ఎదురూ రు గ్రామంలో ఎవరూ పర్యటించకూడదని విష్ణువర్ధన్ రెడ్డి నియంతలా పనిచేస్తున్నారని, గ్రామస్ధుడు గుడి కోసం 15 సెంట్లు స్థలం ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. విష్ణువర్ధన్ రెడ్డి స్ధానికంగా కొందరు తన వర్గం వాళ్లతో కలిసి మైనార్టీల పేరుతో తప్పుడు కేసు పెట్టించారని విమర్శించారు. గుడి నిర్మాణం కోసం నిర్ణయం తీసుకున్న తరువాత కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారన్నారు. కొడుమూరులో ఎక్కడా లేని ఇబ్బంది ఇక్కడే వస్తోందన్నారు.
టీడీపీ ఇంచార్జ్ గా కోడుమూరుకు ఎం చేశావ్?
40 ఏళ్ల నుంచి టీడీపీలో ఉంటూ నియోజక వర్గ ఇంచార్జ్ గా ఉన్నప్పుడు ఏం చేసావని విష్ణు వర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సుధాకర్ మండిపడ్డారు. గ్రామంలో ఎందుకు గుడి కట్టించలేదో ప్రజలు ప్రశ్నించాలని సూచించారు. ఇప్పుడు గుడి నిర్మాణానికి ముందుకు వెళ్తుంటే వాస్తు, కమిటీ పేరుతో అడ్డుకట్టలు వేస్తున్నారని ఎమ్మెల్యే సుధాకర్ మండిపడ్డారు. దీంతో పాటు అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ అడ్డు పడుతోందని విమర్శించారు. టీడీపీ రాజకీయాల కారణంగా గుడిలో ఉన్న దేవుడి విగ్రహాలను పంచాయతీ ఆఫీస్ లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నీచ రాజకీయాలను ప్రోత్సహించేందుకు టీడీపీకి సిగ్గు లేదన్నారు.vమాకు రాజకీయాలు ముఖ్యం కాదు, గ్రామంలో గుడి నిర్మాణమే ముఖ్యం అన్నారు.
హైద్రాబాద్ చార్మినార్ పక్కన ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని, కానీ ఎదురు గ్రామంలో మసీదు పక్కన విరాళం ఇచ్చిన స్థలంలో గుడి నిర్మించాలనే ప్రజల కోరిక టీడీపీ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. విష్ణువర్ధన్ రెడ్డి లాంటి మత ఉన్మాదులకు మత సామరస్యం లాంటి విషయాలు కనిపించవన్నారు.