విజయవాడ బ్యూరో ప్రతినిధి: నాయీ బ్రాహ్మణులను ఆర్థికంగా ఉన్నత స్థానానికి తీసుకురావాలనే పవిత్ర ఆశయంతో వారి సంక్షేమానికి కృషి చేస్తానని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. మంగళవారం రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి సవిరి మహేష్ ఆధ్వర్యంలో చిట్టినగర్ ఈద్గా మహల్ లో నాయీ బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాయీ బ్రాహ్మణుల సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఐదేళ్ల పాలనలో వారి అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదన్నారు. సమాజంలో నాయీ బ్రాహ్మణులు గౌరవంగా బతికేందుకు సొంతంగా షాపులు నిర్వహించేలా బ్యాంకు లోన్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ పాలనలో బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా, నాయీ బ్రాహ్మణులకు ఎటువంటి సంక్షేమ ఫలాలు అందలేదని కంటి తుడుపు చర్యగా నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. కార్పొరేట్ వ్యవస్థను తీసుకొచ్చి నాయీ బ్రాహ్మణుల కడుపు కొట్టే విధంగా అనధికార సెలూన్లకు వైసీపీ అనుమతులు ఇచ్చిందని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే వారు గౌరవప్రదంగా జీవించేలా కృషి చేస్తామని పశ్చిమ నియోజకవర్గ నాయీ బ్రాహ్మణులు అందరూ తనను గెలిపించే విధంగా కృషి చేయాలని సుజనా చౌదరి కోరారు. సమాజ సేవలో భాగస్వామ్యులైన నాయీబ్రాహ్మణులు ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించడం చాలా సంతోషమని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న బుద్దా వెంకన్న అన్నారు. ప్రచారంలో నాయీ బ్రాహ్మణుల స్థితిగతులు గురించి తెలుసుకున్నామని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా నాయీ బ్రాహ్మణులకు అనేక పథకాలు తీసుకొచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడం దురదృష్ట కరమన్నారుమిల్క్ ప్రాజెక్ట్ సమీపంలో నాయీ బ్రాహ్మణులకు ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని చేపట్టేలా చర్యలు దేవాలయాల్లో వారి కేటాయించిన ఉద్యోగాలను కూడా వారికి మాత్రమే చెందేలా కృషి చేస్తానన్నారు. పశ్చిమ నియోజకవర్గం నాయీ బ్రాహ్మణులందరూ సుజనా చౌదరికి అండగా ఉండి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.నాయీ బ్రాహ్మణులకు బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్స్ వచ్చే విధంగా చర్యలు చేపడతామని నాగుల్ మీరా చెప్పారు. మిల్క్ ప్రాజెక్టు సమీపంలో వాయిద్య కళాకారుల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని అన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలో బరిలో వుండటం అందరి అదృష్టంగా భావించాలని, ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు వైద్యం శాంతారామ్ సహా నాయీ బ్రాహ్మణ సంఘీయులు పాల్గొన్నారు.