వెబ్ క్యాస్టింగ్, జీపీఎస్ ద్వారా మద్యం సరఫరాపై నియంత్రణ
మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీ నిరోధించాలి
రూ.100 కోట్ల విలువ పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్ జప్తు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా వెలగపూడి, ప్రధాన ప్రతినిధి : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీ నిరోధించాలని, వెబ్ క్యాస్టింగ్, జీపిఎస్ ద్వారా మద్యం సరఫరాను నియంత్రించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంబందిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో అక్రమ మద్యం సరఫరాను అరికట్టేందుకు వెబ్ క్యాస్టింగ్, జీపీఎస్ సాంకేతికత ద్వారా నిఘా పెంచేందుకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ను ఆదేశించారు. రాష్ట్రంలోని డిస్టీలరీలు-బ్రెవరీలు (మద్యం తయారీ సంస్థలు), మద్యం గోడౌన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, మద్యం తయారీ-నిల్వ చేసే స్థలాల వంటి కీలక స్థానాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా సంస్థలు, గోడౌన్లకు వచ్చి వెళ్లే వాహనాలు, మద్యం తరలించే వాహనాలకు జీపీఎస్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాలన్నారు.
మద్యం సరఫరాపై నియంత్రణ : మద్యం తయారీ సంస్థల నుండి మద్యం షాపులు, బార్లు , ఇతర సంస్థలకు సరఫరా చేస్తున్న వాహనాలపై జీపీస్ ట్రాకింగ్ ద్వారా నిఘా ఉంచాలన్నారు. ఈ ప్రక్రియను అంతా వెబ్ క్యాస్టింగ్ ద్వారా గమనించేలా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేయాలన్నారు. ఈ నెల 15 లోగా వెబ్ క్యాస్టింగ్, మద్యం సరఫరా చేసే వాహనాల జీపీఎస్ ట్రాకింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు అన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడం ద్వారా మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీని నిరోధించాలని, తనిఖీలను ముమ్మరం చేయాలని ఆబ్కారీ శాఖ కమిషనర్ కు, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో కమిషనర్ కు ఆదేశాలు జారీచేశారు. మద్యాన్ని దుర్వినియోగ పర్చడం ద్వారా ఓటర్లను ప్రలోభపర్చేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా అన్ని మార్గాలను మూసివేయాలని ఆదేశించారు. ఈ విషయంలో భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం జారీచేసిన మార్గదర్శకాలను పటిష్టంగా అమలు పర్చాలని ఆదేశించారు.
రూ.100 కోట్ల విలువ పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్ జప్తు : ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను జప్తు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఓటర్లను ప్రలోభపర్చే నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఇతర వస్తువుల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘాను ఉంచడం జరిగిందన్నారు. అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చెక్ పోస్టుల ద్వారాను మరియు పోలీస్, ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్సు, ఫారెస్టు, ఇడి, ఎన్సీబి, ఆర్పిఎఫ్, కస్టమ్స్ తదితర 20 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలకు పైబడి ఓటర్లను ప్రభావింతం చేసే వస్తువులపై నిరంతరం నిఘా కాస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫలితంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తదుపరి నుండి రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను జప్తు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో కేవలం గత 24 గంటల్లోనే రూ.197.66 లక్షల విలువైన వస్తువులను జప్తుచేయడం జరిగిందన్నారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నాటి నుండి నేటి వరకూ రూ.2,503.13 లక్షల నగదు, రూ.1,249.68 లక్షల విలువైన 6,14,837.76 లీటర్ల లిక్కర్, రూ.205.94 లక్షల విలువైన 68,73,891.25 గ్రాముల డ్రగ్స్ , రూ.5,123.58 లక్షల విలువైన 11,54,618.90 గ్రాముల ప్రెషస్ మెటల్స్, రూ.242.94 లక్షల విలువైన 4,71,020 ఫ్రీ బీస్ (ఉచితాలను), 704.66 లక్షల విలువైన 9,84,148.09 ఇతర వస్తువులను జప్తు చేయడం జరిగిందని తెలిపారు.