విజయవాడ బ్యూరో ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించ పరిచేలా టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాను ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈమేరకు బుధవారం వెలగపూడి సచివాలయం నందు ఆధారాలతో సహా ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు ప్రజలు మొహం చాటేస్తుండటంతో కూటమి అభ్యర్థుల వెన్నులో వణుకు పుడుతోందని మల్లాది విష్ణు అన్నారు. ఓటమిని ముందుగానే గ్రహించి.. భయంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, పదేపదే ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాయలపకీరు అంటూ ముఖ్యమంత్రి గూర్చి వ్యాఖ్యానించడం, అంతకన్నా దిగజారి మాట్లాడటాన్ని తప్పుబట్టారు. ఈసీ నోటీసులిచ్చినా బాబు తీరు మాత్రం మారడం లేదన్నారు. ముఖ్యమంత్రిపై అక్కసు వెళ్లగక్కడమే తెలుగుదేశం పనిగా మారిపోయిందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారం కోసం టీడీపీ విడుదల చేయబోతున్న ‘జరుగు జగన్ – జరుగు జగన్’ అనే పాటలోని చరణాలు పూర్తిగా ముఖ్యమంత్రిని కించపరిచేలా ఉన్నాయని.. కనుక పాట విడుదల కాకుండా నిలుపుదల చేయాలని ఈసీని కోరారు. ఇప్పటికే ‘సైకో పోవాలి – సైకిల్ రావాలి’ అనే పాటపై కూడా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదును అందించినట్లు చెప్పారు. తెలుగుదేశం సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం, టీడీపీ వాయిస్ మెసేజ్ లపై ఈసీ స్పందించిన తీరు హర్షణీయమన్నారు.
యూటర్న్ లకు బాబు బ్రాండ్ అంబాసిడర్
రాష్ట్రంలో యూటర్న్ లకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారని మల్లాది విష్ణు విమర్శించారు. ఒక్క వాలంటీర్ల విషయంలోనే అనేక సార్లు యూటర్న్ లు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. నిన్నమొన్నటి వరకు మోదీని నోటికొచ్చినట్లు దూషించి.. చివరకు మరలా బీజేపీతో జతకట్టారన్నారు. అధికారంలో ఉండగా రాష్ట్రంలోకి సీబీఐ రావడానికి వీల్లేదంటూ జీవోలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారం పోయే సరికి సీబీఐ కావాలంటూ పలు సందర్భాలలో మాట్లాడారని గుర్తుచేశారు. ఓసారి గవర్నర్ వ్యవస్థ కావాలంటారు.. అంతలోనే వద్దంటూ ప్రజలలో పూర్తిగా విశ్వాసం కోల్పోయారన్నారు. బెంజి మంత్రి అంటూ గుమ్మనూరు జయరాం గూర్చి తీవ్రస్థాయిలో మాట్లాడి.. చివరకు గుంతకల్లులో సీటు ఇచ్చారన్నారు. బాబు రాజకీయ జీవితమంతా డబుల్ స్టాండ్ తోనే నిండిపోయిందని మల్లాది విష్ణు అన్నారు. ఆయన రెండు నాలుకల ధోరణి చూసి ప్రజలందరూ అసహ్యించుకుంటున్నారన్నారు. అబద్ధాలు, మోసం, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు అంటూ మల్లాది విష్ణు మాట్లాడారు. ఉగాది రోజైనా నిజాలు మాట్లాడతారనుకుంటే.. పండుగ రోజు కూడా అసత్యాలనే వండివార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక టీడీపీ మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తొలగించిన బాబుకు విశ్వసనీయత ఎక్కడుందని మల్లాది విష్ణు ప్రశ్నించారు. కనుక కూటమి నేతల దిగజారుడు ప్రవర్తనను ప్రజలందరూ గమనిస్తున్నారని.. ఈ ఎన్నికలలలో మరోసారి వారందరికీ గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి ఉన్నారు.