రాష్ట్రంలో 2019 ఫలితాలను మించి సీట్లు సాధిస్తాం
అబివృద్దిలో దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో ఏపీ
అభివృద్దిపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు
బీజేపీకి ద్రోహం చేస్తూ చంద్రబాబు కోసం పనిచేస్తున్న పురందేశ్వరి
నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి
నెల్లూరు బ్యూరో ప్రతినిధి : రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని రాజ్యసభ సభ్యులు, నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు. కావలిలో శనివారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి “మేమంతా సిద్ధం” బహిరంగ సభ వద్ద విజయసాయి రెడ్గి మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 175 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఎట్టి పరిస్థితిల్లోనూ గత 2019 ఫలితాలను మించి సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్దిపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు
రాష్ట్రంలో అభివృద్దిపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో నిలిచిందని అన్నారు. రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, ఉదయగిరి అగ్రికల్చరల్ యూనివర్సిటీ, అపాచీ లెదర్ ఫ్యాక్టరీ, క్రిప్కో ఇథనాల్ ప్లాంట్, విశ్వ సముద్ర బయో ఎనర్జీ ప్లాంట్, 1600 కోట్లతో మాండలీస్ చాక్లెట్స్, శ్రీ సిటీలో వరుసగా మూడు ఏసీ తయారీ యూనిట్లు ఏర్పాటు, 18వేల కోట్ల పెట్టుబడితో 5వేల మందికి ఉద్యోగాలు, రాష్ట్రంలో నాడు నేడు కింద 45వేల స్కూల్స్ అభివృద్ధి, 15వేల గ్రామ సచివాలయాలు, 12వేల విలేజ్ హెల్త్ క్లినిక్స్, 12వేల రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 మెగా పోర్టులు ఏర్పాటు, విశాఖ కేంద్రంగా అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు, తడలో శ్రీ సిటీలో కొత్త కంపెనీలు స్థాపించి లక్షల మందికి ఉద్యోగాలు, మొత్తం దక్షిణ భారతదేశానికి సరిపడా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశామని అన్నారు. వైఎస్సార్సీపీ 5 సంవత్సరాల పాలనతో రాష్ట్రంలో రాజీలేని అభివృద్ధి చేసిందని అన్నారు. వ్యవసాయ, సేవా, పారిశ్రామిక రంగాల్లో దేశంలోనే ఏపీ ముందుందని అన్నారు. సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని అన్నారు.
బీజేపీకి ద్రోహం చేస్తూ, చంద్రబాబు కోసం పనిచేస్తున్న పురందేశ్వరి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రబాబు పార్టీ కోసం పనిచేస్తున్నారని, బీజేపీలో ఉంటూ ఆమె ఆ పార్టీకి ద్రోహం చేస్తున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. తేదేపా అధికారంలోకి రావాలనుకుంటే ఆ పార్టీలోనే చేరి నేరుగా సేవలందించవచ్చని, తెరవెనుక పాత్ర పోషించడం తగదని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ నాయకులు ఇప్పటికే గుర్తించారని అన్నారు. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు అనుభవించి ఒక ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన సాధారణ వ్యక్తికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించి ఆయన పార్టీకి దూరమయ్యాడని, ఇది శోచనీయమని అన్నారు.
నిజమైన ప్రజా నాయకుడు వైఎస్ జగన్
కార్యదీక్ష, పట్టుదల, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపించే గుణం ఉన్న వ్యక్తే నిజమైన ప్రజా నాయకుడవుతాడని, అటువంటి గుణాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో పుష్కలంగా ఉన్నాయని విజయసాయి రెడ్డి అన్నారు.