మంత్రి కారుమూరి అందరివాడు : తణుకులో కాపుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ముద్రగడ
తణుకు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలపాలిట పెన్నిదిగా అందిస్తున్న పరిపాలనను చూసే వైఎస్సార్సీపీలో చేరానని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తణుకు కాపు కల్యాణ మండంలో శనివారం నిర్వహించిన కాపు వర్గీయుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేనేమీ పదవులు ఆశించి పార్టీలోకి రాలేదని మంచి పరిపాలన అందిస్తున్న జగన్ వైపు నిలబడాలనే వచ్చానని ఏదైనా గౌరవం ఇస్తే తీసుకుంటానే కానీ అడగబోనని చెప్పారు. కాపులకు మంచి చేసిన ఘనత సీఎం జగన్ క్కు మాత్రమే దక్కుతుందని ఎవరు మంచి చేశారో ప్రజలు గమనించుకోవాలని కోరారు. కాపులంతా కష్టపడి అభివృద్ధి దిశగా సాగాలని పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎదగాలని సూచించారు. అందరివాడుగా పేరుగాంచిన మంత్రి కారుమూరి కడుపు చూసే వ్యక్తి అని ఆయనకు అండగా నిలబడితే మంచి చేస్తారని అన్నారు.
జగన్ వైపు నిలిచిన మహావ్యక్తి ముద్రగడ
సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రజారంజక పాలనకు అండగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జీవితం ఎంతో నీతివంతమైందని, కొవ్వొత్తిలా కరుగుతూ కాపు జాతికి వెలుగునిచ్చారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. కాపుల కారణంగానే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానని, అత్తిలికి చెందిన మద్దాల నాగేశ్వరరావు చేయూతతోనే నా రాజకీయ జీవితం మొదలైందని అన్నారు. అన్ని వర్గాలకు మంచి చేస్తూ అందరివాడిలా ఉండాలనేదే నా తపన అని స్పష్టం చేశారు.