అమరావతి బ్యూరో ప్రతినిధి : అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. దస్తగిరి పిటిషన్‌పై సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరింది. హైకోర్టు విధించిన బెయిల్ షరతులు ఆయన ఉల్లంఘించారని తెలిపింది. అవినాష్‌రెడ్డి, ఇతర నిందితులు అత్యంత ప్రభావితం చేసే వ్యక్తులు. నిందితులు ఇప్పటికే పలువురు సాక్షులను ప్రభావితం చేశారు. వివేకా హత్యకేసులో దస్తగిరి కీలక సాక్షి, అప్రూవర్. అతనితో పాటు కుటుంబ సభ్యులనూ నిందితులు బెదిరిస్తున్నట్టు దస్తగిరి చెబుతున్నారు. బెదిరింపులు, ప్రలోభాల నుంచి దస్తగిరి, ఇతర సాక్షులను కాపాడాలంటే అవినాష్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరింది. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేసింది.