సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి
అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ఏప్రిల్ 25 వరకు నిరవధికంగా క్లాసులు
పాలిటెక్నిక్ ప్రవేశాల పెంపు లక్ష్యంగా ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ
విజయవాడ : పాలిటెక్నిక్ ప్రవేశాల పెంపు లక్ష్యంగా పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష కోసం ఏప్రిల్ 1వ తేదీ నుండి విద్యార్ధులకు సమగ్ర శిక్షణ అందించనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. 2023 – 2024 విద్యా సంవత్సరంలో పదవతరగతి పరీక్షలకు హాజరైన విద్యార్దులతో పాటు, సప్లిమెంటరీ పరీక్షలలో పదవతరగతి పాసైన వారికి సైతం ఉచిత శిక్షణకు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే అయా ప్రభుత్వ, ప్రవేటు పాలిటెక్నిక్ లలో ఉచిత శిక్షణ కోసం వేలాదిగా విద్యార్ధులు నమోదు అయ్యారని, సోమవారం కూడా ఆసక్తి ఉన్నవారు అయా కళాశాలల ప్రిన్సిపల్స్ ను సంప్రదించవచ్చన్నారు. 87 ప్రభుత్వ పాలిటెక్నిక్స్, 182 ప్రైవేటు పాలిటెక్నిక్స్లలో ప్రారంభమయ్యే తరగతులు ఏప్రిల్ 25వ తేదీ వరకు నిర్వహిస్తామని నాగరాణి పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాలలో సిద్దం చేసిన ఉచిత పాలిసెట్ కోచింగ్ మాటీరియల్ను హాజరయ్యే ప్రతి ఒక్క విద్యార్దికి అందిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు సాగే శిక్షణలో రెండు గంటల పాటు గణితం, ఒక గంట భౌతిక శాస్త్రం, మరో గంట రసాయన శాస్త్రం బోధిస్తారన్నారు. విద్యార్దులలో ప్రవేశ పరీక్ష పట్ల భయం పోగోట్టి వారిని ఉత్సాహపరిచే క్రమంలో ఏప్రిల్ 25వ తేదీన ఫ్రీ ఫైనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను సైతం నిర్వహిస్తామని సాంకతిక విద్యా శాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా సంస్ధ ఛైర్మన్ చదలవాడ నాగరాణి వివరించారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షా ఏప్రిల్ 27వ తేదీన కాగా, ఆన్లైన్ అప్లికేషన్లకు ఏప్రిల్ 5 చివరితేదీగా ఉందన్నారు.